IND vs SL 3RD T20: రాజ్ కోట్ లో శ్రీలంకతో సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతోంది. 


'ఇది మంచి ట్రాక్ గా కనిపిస్తోంది. చివరిసారి మేం ఇక్కడ ఆడినప్పుడు బంతి కొంచెం బౌన్స్ అయ్యింది. రాత్రివేళ మరింత స్వింగ్ ఉండవచ్చు. ఈ మ్యాచ్ లో మంచి క్రికెట్ ఆడడంపై మేం దృష్టి పెడతాం. ఆఖరి గేమ్ లో మేం అత్యుత్తమంగా ఆడలేదు. అయితే ఈ మ్యాచ్ లో మానుంచి ఉత్తమ ప్రదర్శన చూస్తారు. మా జట్టులో ఎలాంటి మార్పులు లేవు.' అని భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. 


'టాస్ గెలిస్తే మేం కూడా ముందు బ్యాటింగ్ చేసేవాళ్లం. గేమ్ లో మేం పైచేయి సాధించాలనుకుంటున్నాం. మా జట్టులో ఒక మార్పు జరిగింది. భానుక రాజపక్స స్థానంలో అవిష్క ఫెర్నాండో జట్టులోకి వచ్చాడు.' అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తెలిపాడు. 


నిలకడలేమితో టీమిండియా సతమతం


భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీమ్‌ఇండియా కుర్రాళ్లతో ప్రయోగాలు చేస్తోంది. టాప్‌ ఆర్డర్‌ రాణించకపోవడం ఇబ్బంది పెడుతోంది. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్, రాహుల్‌ త్రిపాఠి, సంజూ శాంసన్‌ ప్రభావం చూపలేదు. దాంతో తొలి టీ20లో అక్షర్ పటేల్‌ దీపక్‌ హుడా, రెండో టీ20లో అక్షర్‌, సూర్యకుమార్‌ శ్రమించాల్సి వచ్చింది. హార్దిక్‌ పాండ్య తన స్థాయి మేరకు సత్తా చాటలేదు. కఠిన పరిస్థితులకు అలవాటు పడేందుకే ఇలా చేస్తున్నామని అతడు చెబుతున్నాడు. అర్షదీప్‌ తన పాత సమస్యతోనే బాధపడటం టీమ్‌ఇండియా కొంప ముంచుతోంది. 2 ఓవర్లలోనే 5 నోబాల్స్‌ వేయటంతో 37 పరుగులు అదనంగా వచ్చాయి. అతడెంత త్వరగా ఈ సమస్య నుంచి బయటపడితే అంత మంచింది. శివమ్‌ మావి ఆకట్టుకుంటున్నాడు. స్పిన్‌తో ఇబ్బందేమీ లేదు.


లంక దూకుడు


సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు తిరుగులేదు. 2019లో ఆసీస్‌ చేతిలో 2-0తో ఓటమి పాలయ్యాక వరుసగా 11 సిరీసులు గెలిచింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు సిరీస్ ఓటమి భయం అంచున నిలిచింది. ఒకవేళ పరాజయం చవిచూస్తే లంకేయులకు 6 ప్రయత్నాల్లో తొలి సిరీస్‌ దక్కుతుంది. ఈ సిరీసులో దసున్‌ శనక జట్టు తెలివిగా ఆడుతోంది. బ్యాటింగ్‌లో ఎవరో ఇద్దరు నిలుస్తూనే ఉన్నారు. రెండో టీ20లో ఫస్టాఫ్‌ లో కుశాల్‌ మెండిస్‌ బాదేస్తే సెకండాఫ్‌లో శనక వీరంగం సృష్టించాడు. బౌలింగ్‌లో వనిందు హసరంగ, మహీశ్‌ థీక్షణ రెచ్చిపోతున్నారు. వారికి ఫాస్ట్‌ బౌలర్లు అండగా నిలిస్తే పుణెలో సీనే రిపీట్ అవుతుంది.