IND vs SL: రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానం వేదికగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే అంతకుముందు ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేశాయి. ఈ మూడో మ్యాచ్‌లో ఇరు జట్లలోని కొంతమంది ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉంటుంది. ఏ క్షణంలోనైనా మ్యాచ్ గమనాన్ని మార్చగల ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.


1. అక్షర్ పటేల్
పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో శ్రీలంకను కష్టాల్లోకి నెట్టిన అక్షర్ పటేల్ పైనే అందరి దృష్టి మరోసారి కేంద్రీకృతమైంది. ఆ మ్యాచ్‌లో అక్షర్ 31 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 65 పరుగులతో భీకర ఇన్నింగ్స్ ఆడాడు.


2. దసున్ షనక
శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత్‌పై గత ఐదు ఇన్నింగ్స్‌లుగా దూకుడుగా ఆడుతున్నాడు. రెండో మ్యాచ్‌లో అతని విధ్వంసక అర్ధశతకం శ్రీలంక 206 పరుగుల భారీ స్కోరును సాధించడానికి సహాయపడింది. షనక 22 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 56 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ అందరి చూపు అతనిపైనే ఉంటుంది.


3. సూర్యకుమార్ యాదవ్
రెండో మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ మూడో మ్యాచ్‌లో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్‌లో 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.


4. కుశాల్ మెండిస్
శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ రెండో మ్యాచ్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 52 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఓపెనింగ్‌కు దిగిన మెండిస్‌ తన జట్టుకు శుభారంభం అందించాడు.


5. హార్దిక్ పాండ్యా
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పెద్ద పాత్ర పోషించగలడు. గత మ్యాచ్‌లో బ్యాట్‌తో ఫ్లాప్ అయిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అద్భుతంగా రాణించాడు. 6.50 ఎకానమీతో రెండు ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో అతను బ్యాట్‌తో కూడా సమర్థవంతంగా రాణించగలడు.