Bandi Sanjay : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా రైతులు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు, నేతలు విశ్వప్రయత్నం చేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు...  బండి సంజయ్‌, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో పాటు 12 మంది బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశారు. 


బీజేపీ నేతలపై కేసులు 


కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడిలో బండి సంజయ్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా కలెక్టరేట్ ముట్టడి, ప్రభుత్వ వాహనం ధ్వంసం చేసినందుకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తతలకు కారణమైన మరో 25 మందికి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బండి సంజయ్‌ పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు చేసేందుకు ప్రయత్నించారు. బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చెలరేగింది. కలెక్టరేట్ లో వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేశారు. కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి లోపలికి ప్రవేశించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ కు తరలించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలపై కామారెడ్డి పోలీసులు ఈరోజు కేసు నమోదు చేశారు. 






కామారెడ్డిలో సెక్షన్ 30 


కామారెడ్డిలో పోలీస్ యాక్ట్ సెక్షన్‌ 30 అమలులో ఉందని ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కామారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, దార్ల ఉదయ్ శంకర్, ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రకాష్, లక్ష్మీపతి, మనోజ్, ప్రదీప్ తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు.  


హైకోర్టును ఆశ్రయించిన రైతులు


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ ఇంకా కొనసాగుతుంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో రైతులు పిటీషన్ దాఖలు చేశారు. తమను అడగకుండా మాస్టర్ ప్లాన్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పిటీషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. కాగా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. శనివారం కూడా ఆందోళన చేపడతామని రైతులు తెలిపారు. ఆందోళన చేస్తున్నా కూడా కలెక్టర్ కలవకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.