ఆమెకు, అతడికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని రెండు నెలలుగా రూమ్ లో బంధించాడు. చిత్ర హింసలు పెట్టేవాడు, లైంగికంగా వేధించేవాడు. ఆమెను బయటకు రాకుండా రూమ్ లోనే బంధించి తాళం వేసేవాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారాన్ని గమనించిన పొరుగింటివారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు వచ్చి ఆమెను అతడి చెర నుంచి విడిపించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగింది.
లంకేశ్వర్ అనే ఆ దుర్మార్గుడు మతిస్థిమితం లేదని తెలిసి ఆ యువతిని చేరదీసినట్టు నటించి ఇంట్లో బంధించాడు. రెండు నెలలుగా ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసి రోజూ బయటకు వెళ్లొచ్చేవాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఆమె కేకలు వేయడం పరిపాటి. చుట్టుపక్కలవాళ్లు ఈ విషయంపై నిఘా పెట్టి చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఎంక్వయిరీ చేసినా కూడా లంకేశ్వర్ కథలు చెప్పసాగాడు. చివరకు ఆ యువతిని అతడి చెర నుంచి విడిపించి వైద్య పరీక్షలకు పంపించారు. అతడి తప్పుందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బుచ్చిరెడ్డిపాలెం సీఐ వీరప్రతార్.
ఎవరా యువతి..?
ఆ యువతి తాను ఆత్మకూరు వాసినని చెబుతోంది. యువతి తండ్రి పేరు శ్రీరాములురెడ్డి అని పోలీసులు చెప్పారు. ఆమె తల్లి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ కొంతకాలం క్రితం చనిపోయారు. ఈ క్రమంలో ఆ యువతికి తల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద మంజూరు చేశారు. కొడవలూరు మండలం ఎల్లాయపాలెం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె విధుల్లో చేరారు. కొంతకాలంపాటు విధులు నిర్వహించిన యువతి... క్రమక్రమంగా మనోవేదనకు గురైంది. తల్లి మృతి చెందిన విషయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యేదని ఎల్లాయపాలెం ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత కొంతకాలానికి పూర్తిగా మతి స్థిమితం కోల్పోయిన ఆ యువతి విధులకు కూడా సరిగా హాజరయ్యేవారు కాదు. గతేడాది అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ఆమె విధులకు హాజరు కావడంలేదు. రోడ్లపై తిరుగుతూ ఉండేది.
రోడ్లపై తిరుగుతూ.. గతేడాది ఇలాగే తప్పిపోవడంతో యువతి కుటుంబ సభ్యులు కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఆమెను వెతికి పట్టుకున్న పోలీసులు తిరిగి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మళ్లీ తప్పిపోయి నార్త్ రాజు పాలెంలో లంకేశ్వర్ కి కనిపించారు. దీంతో అతను ఆమెను బుచ్చిరెడ్డిపాలెం తీసుకెళ్లి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. అయితే లంకేశ్వర్ ఆమెను రెండు నెలలుగా ఇంటిలోనుంచి బయటకు రానివ్వలేదు. బుచ్చిరెడ్డిపాలెంలో సమోసాలు విక్రయిస్తుండే లంకేశ్వర్ ఆమెను, రూమ్ లో బంధించి రోజూ వచ్చిపోయేవాడు. సరిగా భోజనం పెట్టేవాడు కాదు. ఆమెను ఇంట్లో ఉంచి తలుపులు పెట్టి.. సమోసాలు విక్రయించేందుకు వెళ్లేవాడు. గత రెండు నెలలుగా ఇదే తంతు కొనసాగుతోంది. రోజూ ఆమె కేకలు వేస్తుండడంతో.. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు, మీడియాకు తెలపడంతో వ్యవహారం బయటపడింది. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు.