IND vs SL, 3rd ODI:  పరుగుల యంత్రం పరుగు మళ్లీ మొదలైంది. విరాట్ బ్యాట్ నుంచి పరుగుల వరద తిరిగి పారుతోంది. చాలాకాలంగా ఫాం కోల్పోయి తంటాలు పడిన ఈ రన్ మెషీన్ ప్రస్తుతం తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. దాదాపు నాలుగేళ్లుగా ఫాం లేమితో సతమతమైన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం తన పూర్వపు ఫాంను ఘనంగా అందుకున్నాడు. ఆసియా కప్ నుంచి తిరిగి సత్తా చాటుతున్న కింగ్.. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంకతో వన్డే సిరీస్ లో ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. 3 వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలు బాదాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ భారీ శతకం (166 నాటౌట్) చేశాడు. దీంతో భారత్ శ్రీలంక ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లీతో పాటు గిల్ కూడా సెంచరీ చేశాడు. 


శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. గిల్, కోహ్లీలు శతకాలు బాదారు. రోహిత్, శ్రేయస్ లు సమయోచిత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 


పరుగుల వరద


టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ (42) ఔటైనా.. గిల్, కోహ్లీలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. గిల్ చూడచక్కని షాట్లతో అలరించగా.. కోహ్లీ తనకలవాటైన రీతిలో సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులు సాధించారు. ఈ క్రమంలో గిల్ 85 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది గిల్ కు రెండో వన్డే సెంచరీ. సెంచరీ తర్వాత మరో 3 షాట్లు కొట్టిన గిల్ కసున్ రజిత బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఇక ఆ తర్వాత మొదలైంది విరాట్ మోత. 


విరాట్ విశ్వరూపం


అర్ధసెంచరీ వరకు ఓ మోస్తరు వేగంగా ఆడిన కోహ్లీ తర్వాత వేగంగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో  85 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. శతకం తర్వాత విరాట్ విశ్వరూపం చూపించాడు. వన్డే కెరీర్ లో 46వ సెంచరీ అందుకున్న కోహ్లీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. చూడచక్కని సిక్సులు కొట్టాడు. చమిక కరుణరత్నే వేసిన 45వ ఓవర్లో 2 సిక్సులు, ఒక ఫోర్ కొట్టిన కోహ్లీ 47వ ఓవర్లో మరో 2 సిక్సులు, ఫోర్ దంచాడు. ఈ క్రమంలో 106 బంతుల్లోనే 150 మార్కును అందుకున్నాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసింది.  చివరి ఓవర్లలో భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (7), సూర్యకుమార్ యాదవ్ (4) తక్కువ స్కోరుకే  ఔటయ్యారు.