Shubman Gill ODI Century: శ్రీలంకతో జరుగుతున్న ఆఖరిదైన మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు మొదటి వికెట్ కు 95 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత రోహిత్ ఔటైనా గిల్, కోహ్లీలు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో గిల్ 89 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కెరీర్ లో 65వ అర్ధశతకాన్ని సాధించాడు. వీరిద్దరి విజృంభణతో భారత్ భారీస్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 32 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 220 పరుగులు చేసింది. గిల్, కోహ్లీలు అజేయంగా రెండో వికెట్ కు 130 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సిరీస్ ను 2-0తో టీమిండియా గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్య, ఉమ్రాన్ మాలిక్ ల స్థానంలో వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
'పిచ్ బాగుంది. ముందు బ్యాటింగ్ చేస్తాం. పిచ్ ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మా జట్టులో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టిపెట్టాం. మా సహజమైన ఆటను ఆడడానికి ప్రయత్నిస్తాం' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తిరువనంతపురం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాలతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడబోతోంది. కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్ పాత్ర పోషించనున్నాడు. ఇక ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టను సుందర్ లు ఉన్నారు.
'ఇక్కడి వాతావరణం శ్రీలంకను పోలి ఉంది. మా బ్యాటర్లు మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీన్ని ఈరోజు మెరుగుపరచుకోవాలనుకుంటున్నాం. మా జట్టులో రెండు మార్పులు జరిగాయి. ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లలగే స్థానంలో అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే జట్టులోకి వచ్చారు.' అని శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక వివరించాడు.