IND vs SA 3rd T20: ఇండోర్‌ టీ20లో సఫారీలు కుమ్మేశారు! ఆఖరి మ్యాచును మరింత రసవత్తరంగా మార్చేశారు. హోల్కర్‌ స్టేడియాన్ని హోరెత్తించారు. టీమ్‌ఇండియాకు 228 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించారు. రిలీ రొసో (100*; 48 బంతుల్లో 7x4, 8x6) తిరుగులేని సెంచరీతో అలరించాడు. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (68; 43 బంతుల్లో 6x4, 4x6) అద్దిరిపోయే ఓపెనింగ్‌ అందించాడు. త్రిస్టన్‌ స్టబ్స్‌ (23) ఫర్వాలేదనిపించాడు.






ఒకర్ని మించి ఒకరు!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలను మరోసారి ఓపెనింగ్‌ వైఫల్యం వెంటాడింది. కెప్టెన్‌ తెంబా బవుమా (3) ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 4.1వ బంతికి ఔటయ్యాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 48-1తో నిలిచింది. ఆ తర్వాత ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిలీ రొసో దంచికొట్టడం షురూ చేశారు. ఒకరిని మించి మరొకరు బౌండరీలు, సిక్సర్లు కొట్టారు. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 89 భాగస్వామ్యం నెలకొల్పారు. డికాక్‌ 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేయడంతో సఫారీలు 10.1 ఓవర్లకే 100 మైలురాయి చేరుకున్నారు. జట్టు స్కోరు 120 వద్ద డికాక్‌ రనౌట్‌ కావడంతో రొసో వీర బాదుడు బాదాడు. టీమ్‌ఇండియా బౌలర్లను వెంటాడి మరీ ఊచకోత కోశాడు. 27 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. త్రిస్టన్‌ స్టబ్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 బంతుల్లో 87 భాగస్వామ్యం అందించాడు. ఆఖరి ఓవర్లో స్టబ్స్‌ ఔటైనా మిల్లర్‌ (19*; 5 బంతుల్లో) హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది జట్టు స్కోరును 227-3కి చేర్చాడు.