IND vs SA 2nd Test Highlights  దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌.. కెరీర్‌లోనే అద్భుత స్పెల్‌తో సఫారీలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్‌ మియా నిప్పులు చెరిగే బంతులకు ప్రొటీస్‌ బౌలర్ల వద్ద సమాధానమే కరువైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే సిరాజ్ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ మాక్రమ్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. యశస్వి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చిన మాక్రమ్ ఔటయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన సిరాజ్ సౌతాఫ్రికా కెప్టెన్‌ ఎల్గర్‌ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.


కాసేపటికే టోనీ డి జోర్జి(2)ని కూడా ఔట్ చేశాడు. ఒకే ఓవర్లో బెడింగ్‌హామ్‌ (12), మార్కో జాన్‌సెన్ (0)ని ఔట్ చేసి సిరాజ్‌ ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సిరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో వెరినే (15).. స్లిప్‌లో శుభ్‌మన్‌కు చిక్కాడు. దక్షిణాఫ్రికా 18 ఓవర్లకు 45 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ను బుమ్రా.. కేశవ్‌ మహరాజ్‌ను ముఖేష్‌కుమార్‌ అవుట్‌ చేశారు. దీంతో 50 పరుగులకే సఫారీలు ఎనిమిది వికెట్లు కోల్పోయారు. అనంతరం బుమ్రా, ముఖేష్‌ చెరో వికెట్‌ తీయడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. 


సిరాజ్‌ టెస్ట్‌ క్రికెట్‌లో కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేశాడు. 9 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు నేలకూల్చాడు. బుమ్రా రెండు, ముఖేష్‌ కుమార్‌ రెండు వికెట్లు తీశారు. టీమిండియా పేసర్ల ధాటికి తొమ్మిది మంది దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో అత్యధిక స్కోరు 15 పరుగులే అంటే భారత సీమర్లు ఎంతలా చెలరేగిపోయారో అర్థం చేసుకోవచ్చు.  టీమిండియా పేసర్ల దెబ్బకు సఫారీ జట్టు టాప్ 9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు క్యూ కట్టారు. 


టాస్‌ ప్రొటీస్‌దే. 
 ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన సఫారీ జట్టు కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌ బ్యాటింగ్‌ఎంచుకున్నాడు. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడుతోన్న ఎల్గర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికా తరఫున ట్రిస్టన్ స్టబ్స్‌ అరంగేట్రం చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గెరాల్డ్ కోయిట్జీ స్థానంలో లుంగి ఎంగిడి.. కీగన్ పీటర్సెన్‌కు బదులు కేశవ్ మహరాజ్‌ తుది జట్టులోకి వచ్చారు. భారత్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్‌కు బదులు రవీంద్ర జడేజా, ముకేశ్‌ కుమార్‌ తుది జట్టులోకి వచ్చారు.


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌
దక్షిణాఫ్రికా: డీన్‌ ఎల్గర్ (కెప్టెన్), ఐదెన్ మార్‌క్రమ్, టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్‌ బెడింగ్‌హామ్‌, కైల్‌ వెర్రీన్నె (వికెట్ కీపర్), మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, నాండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి