ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. కానీ ఇన్నింగ్స్ బ్రేక్‌లో ప్రారంభం అయిన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ నిలిపివేయక తప్పలేదు. దాదాపు 10 గంటల వరకు మ్యాచ్ నిర్వహించడానికే ప్రయత్నించారు. కానీ ఎడతెరపని వర్షం కారణంగా ఇది సాధ్యం కాలేదు.
మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ సాయంత్రం 7:45 గంటలకు ముగిసింది. అయితే వెంటనే 7:50 గంటలకే వర్షం ప్రారంభం అయింది. రాత్రి 8:30 గంటలకు వర్షం కాస్త తెరిపిని ఇచ్చింది. ఆ సమయంలో మ్యాచ్ అధికారులు గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడారు. తొమ్మిది గంటల సమయంలో పిచ్‌ను పరీక్షించాలని అనుకున్నారు. ఒకవేళ వర్షం తగ్గితే 25 నుంచి 30 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించాలని అనుకున్నారు.
ఎంతకీ తగ్గకపోవడంతో...
కానీ ఆ తర్వాత వర్షం మళ్లీ ప్రారంభం అయింది. అస్సలు తగ్గలేదు. రాత్రి 10:30 సమయానికి మ్యాచ్ నిర్వహించడం సాధ్యమైతే 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని కటాఫ్‌గా పెట్టుకున్నారు. కానీ వర్షం తగ్గేలా కనిపించలేదు. దీంతో దాదాపు 10 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే భారత్‌కు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), విరాట్ కోహ్లీ (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఘోరంగా విఫలం అయ్యారు. ఈ ఇద్దరినీ షహీన్ షా అఫ్రిది బౌల్డ్ చేసి భారత్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. దీంతో 27 పరుగులకే భారత జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
కానీ ఆ తర్వాత కూడా భారత్ బ్యాటర్ల వైఫల్యాల పరంపర ఆగలేదు. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10: 32 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యాడు. టూ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (14: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ స్కోరు బోర్డుపై 66 పరుగులు చేరేసరికే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
అయితే ఆ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టీమిండియాను ఆదుకున్నారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 141 బంతుల్లో 138 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. కానీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. నసీం షా, హరీస్ రౌఫ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial