IND vs PAK:  దాయాదుల  పోరులో భాగంగా  పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ హద్దులు మీరాడు.  మ్యాచ్‌కు ముందు  ‘మనం మనం బరంపురం’ అనుకున్న పాక్ ఆటగాళ్లు ఆటలో మాత్రం ఆ సోదర భావాన్ని ప్రదర్శించలేకపోయారు. ముఖ్యంగా ఆ జట్టు పేసర్ హరీస్ రౌఫ్ అయితే  వికెట్లు తీసినప్పుడు శృతి మించాడు. ఒక బౌలర్ వికెట్ పడగొట్టినప్పుడు సంబురాలు చేసుకోవడం   తప్పేం కాదు. కానీ ఆ  సంబురాలు ఎదుటివారిని హర్ట్ చేయనంతవరకే.. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టమొచ్చినట్టు వాగితే  పనిష్‌మెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 


వివరాల్లోకెళ్తే.. శనివారం నాటి మ్యాచ్‌లో పాక్  పేస్‌కు భారత టాపార్డర్ దాసోహమైంది.  టాపార్డర్ బ్యాటర్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌లు విఫలమయ్యారు.  కానీ  యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాలు భారత జట్టు పరువు నిలిపారు. ఇషాన్ - పాండ్యాలు కలిసి  క్రీజులో నిలదొక్కుకోవడమే గాక  పాకిస్తాన్  పేస్ త్రయం షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లతో పాటు షాదాబ్ ఖాన్,  మహ్మద్ నవాజ్ లను సమర్థంగా  ఎదుర్కున్నారు.  ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. 


అయితే  80లోకి వచ్చిన తర్వాత  ఇషాన్ కిషన్.. హరీస్ రౌఫ్ వేసిన 38వ ఓవర్లో మూడో బంతిని  భారీ షాట్ ఆడబోయాడు. కానీ షాట్ కుదరక బంతి అక్కడే గాల్లోకి ఎగిరి బాబర్ ఆజమ్ చేతిలోకి వెళ్లింది. ఇషాన్ ఔట్ అవ్వగానే హరీస్.. ఇషాన్‌కు పెవిలియన్ చూపుతూ ‘ఛల్ నికాల్, నికాల్ (ఇక్కడ్నుంచి వెళ్లు)’ అంటూ అరుస్తూ అతిగా ప్రవర్తించాడు. ఇదే సమయంలో గంభీర్,  కోహ్లీ వంటి అగ్రెసివ్ ప్లేయర్లు ఉంటే ఏమయ్యేదో గానీ ఇషాన్.. కామ్ గానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.  


 






బుద్దిచెప్పిన హార్ధిక్.. 


ఇషాన్‌కు పెవిలియన్ చూపిస్తూ అతి చేసిన రౌఫ్‌‌కు హార్ధిక్   తర్వాత ఓవర్లోనే కౌంటర్ ఇచ్చాడు. అతడు వేసిన 40వ ఓవర్లో.. హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి రౌఫ్ గర్వమణిచాడు.  తొలి బంతిని  ఆఫ్ సైడ్ దిశగా ఆడిన  హార్ధిక్.. రెండో బంతిని  స్లిప్స్‌లో ఆడాడు. మూడో బంతిని మిడ్ వికెట్  దిశగా ఆడి బౌండరీ రాబట్టాడు. 


 






ఇషాన్ - పాండ్యా హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్..


ఈ మ్యాచ్‌లో  ఇషాన్ - పాండ్యాలు  138 పరుగులు జోడించడంతో  ఐదో వికెట్ ‌కు  పాకిస్తాన్‌పై అత్యధిక భాగస్వామ్యం నిర్మించిన జోడీగా రికార్డులకెక్కారు.  గతంలో (2012లో) ఎంఎస్ ధోని - అశ్విన్‌లు పాకిస్తాన్‌‌పై ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించారు.  2004లో రాహుల్ ద్రావిడ్ - మహ్మద్ కైఫ్‌లు లాహోర్‌లో 132 పరుగులు జోడించారు. ఈ ఇద్దరే 2005లో 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మూడు రికార్డులను  ఇషాన్ - పాండ్యా బ్రేక్ చేశారు.  ఇరు జట్ల తరఫున ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం  ఇమ్రాన్ ఖాన్ - జావెద్ మియందాద్ ల మధ్య నమోదైంది.  1987‌‌లో నాగ్‌‌పూర్ వేదికగా  జరిగిన మ్యాచ్‌లో ఇమ్రాన్ - మియందాద్‌లు ఐదో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. 

























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial