Asia Cup 2022: భారత్- పాకిస్థాన్ ఆటగాళ్లు మైదానంలో మాత్రమే పోటీపడతారని.. బయట అందరూ సరదాగా ఉంటారని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆడేటప్పుడు మాత్రమే తాము తీవ్రంగా పోటీ పడతామని.. ఒకసారి మైదానం బయటకు వచ్చాక అందరం చక్కగా మాట్లాడుకుంటామని వివరించాడు. ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ చాలా మంచి వ్యక్తి అని కోహ్లీ ప్రశంసించాడు.
బాబర్ చాలా ప్రతిభావంతుడు
ఆదివారం మ్యాచ్ తర్వాత మీడియాతో కోహ్లీ మాట్లాడాడు. బాబర్ అజాం, తన మధ్య ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని స్పష్టంచేశాడు. అతను ఎప్పుడూ నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటాడని అన్నాడు. బాబర్ 27 ఏళ్లకే అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాడిగా ఉండడం తనకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదని కోహ్లీ అన్నాడు. తన సంభాషణల్లో పరస్పర గౌరవం, అభిమానం ఉంటుందని తెలిపాడు. బాబర్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడని విరాట్ ప్రశంసించాడు.
పోటీ మైదానంలో మాత్రమే
అలాగే పాకిస్థాన్ జట్టులోని ఇతర ఆటగాళ్లు బయట చాలా సరదాగా ఉంటారని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
మైదానంలోని తమ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని.. మైదానం వెలుపల స్నేహపూర్వకంగా ఉంటామని స్పష్టంచేశాడు. వాళ్లను కలవడం ఎప్పుడూ సంతోషకరంగానే ఉంటుందని కోహ్లీ తెలిపాడు. ఇరు జట్ల మధ్య పరస్పర గౌరవం ఉంటుందని తెలిపాడు.
ఆసియా కప్ కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా భారత్- పాక్ ఆటగాళ్లు కలుసుకున్న వీడియో వైరల్ అయ్యింది. అలాగే టీమిండియా ఆటగాళ్లు గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న షాహీన్ అఫ్రీదిని ప్రత్యేకంగా పలకరించారు.