IND vs NZ ODI: న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ లో ధావన్, గిల్, శ్రేయస్ అయ్యర్ లు రాణించి భారీ స్కోరు సాధించినప్పటికీ... బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలయింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ 80 పరుగులతో భారత్ తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. మ్యాచులో ఓటమి, తర్వాత గేమ్ సన్నద్ధతపై అతను మాట్లాడాడు.
ఒక మ్యాచులో ఓడిపోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మానసికంగా బలంగా ఉండడం ముఖ్యమని తెలిపాడు. కొత్త ఆలోచనలు, పదునైన వ్యూహాలతో తర్వాతి మ్యాచులో బలంగా పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తంచేశాడు. 'భారత్ నుంచి నేరుగా న్యూజిలాండ్ వచ్చి ఆడడం అంత తేలిక కాదు. ప్రాంతాలను బట్టి పిచ్ లు ఉంటాయి. కివీస్ పిచ్ లపై ఆడడం సవాల్ తో కూడుకున్నదే. అయితే పరిస్థితిని అర్ధం చేసుకుని ఆడాం. ఓపెనర్లు అంత మంచి భాగస్వామ్యం అందించాక దాన్నిభారీ స్కోరుగా మలచలేకపోయాం. అయినా చివరికి ప్రత్యర్థికి గట్టి టార్గెట్ నే సెట్ చేశాం. అయితే కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ లు అద్భుతంగా ఆడి మా నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నారు.' అని శ్రేయస్ తెలిపాడు.
మధ్య ఓవర్లలో త్వరగా వికెట్లు కోల్పోయాక 307 స్కోరు చేరుకోవడం మెచ్చుకోదగ్గ అంశమని ఈ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ అన్నాడు. 'ఈరోజు కొన్ని విషయాలు మాకు అనుకూలంగా జరగలేదు. అయితే ఆటలో ఇవన్నీ సహజం. ఆత్మ పరిశీలన చేసుకుని, తప్పుల్ని సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్ కు సిద్ధమవుతాం. ప్రతి పిచ్ దేనికదే వేరుగా ఉంటుంది. మానసికంగా బలంగా ఉండడం, పరిస్థితులను అర్ధం చేసుకుని ఆడడం ముఖ్యమని' చెప్పాడు.
వారిద్దరి భాగస్వామ్యమే మమ్మల్ని ఓడించింది
కివీస్ తొలి 20 ఓవర్లలో ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మెన్ ను కోల్పోయి ఇబ్బంది పడింది. అయితే కెప్టెన్ విలియమ్సన్, టామ్ లాథమ్ 221 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో వారి జట్టును గెలిపించుకున్నారు. ముఖ్యంగా లాథమ్ కేవలం 104 బంతుల్లోనే 145 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని దూరంచేశాడు.
" కేన్, టామ్ ఇద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఏ బౌలర్ ను లక్ష్యంగా చేసుకోవాలో వారికి బాగా తెలుసు. వారి భాగస్వామ్యమే మమ్మల్ని విజయానికి దూరం చేసింది. మధ్య ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 40వ ఓవర్లో టామ్ లాథమ్ చెలరేగి 25 పరుగులు రాబట్టాడు. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది." అని శ్రేయస్ అన్నాడు.
రేపు హోమిల్టన్ వేదికగా రెండో వన్డే జరగనుంది.