IND vs NZ 1st ODI:  హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్ లో టీమిండియా కివీస్ పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట శుభ్ మన్ గిల్ అద్వితీయ  డబుల్ సెంచరీతో భారత్ 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో న్యూజిలాండ్ 337 పరుగులకు పరిమితమైంది. మిగతా బ్యాటర్లు విఫలమైనప్పటికీ మైఖెల్ బ్రాస్ వెల్ వీరోచిత శతకంతో తన జట్టును గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్ లో భారత గెలవడానికి చాలా అంశాలు దోహదం చేశాయి. వాటిలో ముఖ్యమైన రెండు కారణాలు మీకోసం ...


శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ


తొలి వన్డేలో భారత్ విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీ. మిగతా టీమిండియా బ్యాటర్లు అంతగా రాణించనప్పటికీ గిల్ వన్ మ్యాన్ షో చేశాడు. కేవలం 146 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు. అతని ఇన్నింగ్స్ కారణంగానే భారత్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ ముందు కఠినతరమైన లక్ష్యాన్ని ఉంచింది. బ్రాస్ వెల్ (78 బంతుల్లో 140) ఇన్నింగ్స్ తో కివీస్ దాదాపు గెలిచినంత పనిచేసింది. అదే లక్ష్యం కొంచెం చిన్నదైతే కచ్చితంగా న్యూజిలాండ్ గెలిచేదే. 


సిరాజ్ అద్భుత బౌలింగ్


గత కొన్నాళ్లుగా బౌలింగ్ లో అదరగొడుతున్న లోకల్ బాయ్ సిరాజ్ హైదరాబాద్ వన్డేలోనూ చెలరేగాడు. సొంతగడ్డపై గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు. తన 10 ఓవర్ల కోటాలో 46 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. మొదట డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ వికెట్లు పడగొట్టిన సిరాజ్.. ఇన్నింగ్స్ ఆఖర్లో మరో 2 కీలక వికెట్లు తీశాడు. బ్రాస్ వెల్ తో కలిసి దూకుడుగా ఆడుతున్న శాంట్నర్ (57)తో పాటు షిప్లీని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. సిరాజ్ స్పెల్ కచ్చితంగా టీమిండియా విజయానికి దోహదపడింది. సిరాజ్ తో పాటు శార్దూల్, కుల్దీప్ లు చెరో రెండు వికెట్లు తీసి విజయంలో తమ వంతు పాత్ర పోషించాడు.