భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ విజయం ముంగిట నిలిచింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 259 పరుగులు చేసింది. జో రూట్ (76 బ్యాటింగ్: 112 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (72 బ్యాటింగ్: 87 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి.


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56: 65 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), జాక్ క్రాలేలు (46: 76 బంతుల్లో, ఏడు ఫోర్లు) భారత బౌలర్లను చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 107 పరుగులు జోడించారు. అయితే ఇక్కడ ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కేవలం రెండు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (0: 3 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 109 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


అయితే కష్టాలు ఇంగ్లండ్‌కు కాకుండా టీమిండియాకు మొదలయ్యాయి. జో రూట్, జానీ బెయిర్‌స్టో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో మొదట నిదానంగా ఆడినా పిచ్ అలవాటయ్యే కొద్దీ జోరు పెంచారు.


ముఖ్యంగా బెయిర్‌స్టో ఫాంను కొనసాగించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జానీ అదే ఊపును రెండో ఇన్నింగ్స్‌లో కూడా కొనసాగించాడు. మరోవైపు రూట్ కూడా బెయిర్‌స్టోకు ఏ మాత్రం తగ్గలేదు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఇప్పటికే 150 పరుగులు జోడించారు. వీళ్లు ఇదే ఊపు కొనసాగిస్తే ఐదో రోజు మొదటి సెషన్‌లోనే మ్యాచ్ ముగిసిపోవడం ఖాయం. కాబట్టి భారత బౌలర్లు జాగ్రత్తగా కొత్త వ్యూహంతో రేపు బౌలింగ్ వేయడం చాలా కీలకం.