Ind vs Bang, 2nd ODI: బంగ్లాదేశ్ తో కీలక పోరుకు భారత్ సిద్ధమైంది. రేపు రెండో వన్డేలో ఆ జట్టుతో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి పోరులో టీమిండియా ఓడిపోయింది. రేపటి మ్యాచులో గెలవకపోతే సిరీస్ బంగ్లా సొంతమవుతుంది. కాబట్టి ఇది భారత్ చావో రేవో మ్యాచ్ లాంటింది. సిరీస్ ఆశలు నిలవాలంటే టీమిండియా తప్పక గెలవాల్సిందే. ఢాకా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
కలవరపెడుతున్న బ్యాటింగ్
మొన్నటివరకు బౌలింగే అనుకుంటే ఇప్పుడు బ్యాటర్లు భారత్ ను కలవరపెడుతున్నారు. బంగ్లాతో తొలి వన్డేలో కేఎల్ రాహుల్ తప్ప మిగత బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ధావన్, రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అందుకే కనీసం స్కోరు 200 కూడా అవ్వలేదు. రెండో మ్యాచులో గెలిచి సిరీస్ రేసులో నిలవాలంటే బ్యాటర్లందరూ రాణించాల్సిందే.
బౌలర్లు భళా
తొలి మ్యాచులో భారత బౌలర్లందరూ రాణించారు. కొత్త బంతితో దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ లు బంగ్లా బ్యాటర్లకు కళ్లెం వేశారు. శార్దూల్ ఠాకూర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అరంగేట్ర బౌలర్ కుల్దీప్ సేన్ కూడా పరుగులు ఇచ్చినప్పటికీ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. బౌలర్లందరూ సమష్టిగా రాణించటంతోనే తక్కువ స్కోరును కూడా దాదాపు డిఫెండ్ చేయగలిగారు. చివర్లో మెహదీ హసన్ ఇంకా మన ఫీల్డర్ల కారణంగా భారత్ ఓడిపోయింది కానీ భారత బౌలర్లు గెలిపించినంత పనిచేశారు. రెండో వన్డేలో కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ను తీసుకునే అవకాశం ఉంది.
ఉత్సాహంతో బంగ్లా
ఉత్కంఠభరిత మ్యాచులో టీమిండియాపై విజయం బంగ్లాదేశ్ కు ఉత్సాహనిచ్చేదే. అయితే చివర్లో మెహదీ హసన్ కారణంగా బంగ్లా గెలిచింది కానీ.. ఆ జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ లిటన్ దాస్, షకీబుల్ హసన్ పర్వాలేదనిపించే ప్రదర్శన చేయగా... మిగతా వారు అంతగా రాణించలేదు. బంగ్లా బౌలర్లు మాత్రం అదరగొట్టారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ ను 200లోపే ఆలౌట్ చేయడం చిన్నవిషయం కాదు. ఫైనల్ గా రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ ను గెలవాలనే పట్టుదలతో బంగ్లా ఉంది.
తొలి మ్యాచులో బ్యాటింగ్, ఫీల్డింగ్ లో భారత్ ఘోరంగా విఫలమైంది. కీలకమైన రెండో మ్యాచులో నెగ్గి సిరీస్ ను సమం చేయాలంటే అన్ని విభాగాల్లోనూ టీమిండియా సమష్టిగా రాణించాల్సిందే.
ఎక్కడ, ఎప్పుడు?
రెండో వన్డే ఢాకా వేదికగా బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ టీవీలో ప్రత్యక్షప్రసారం అవుతుంది. అలాగే సోనీ లివ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
పిచ్ పరిస్థితి
తొలి మ్యాచ్ లో లాగానే ఇందులోనూ స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే వారిని సమర్ధంగా ఎదుర్కొంటే పరుగులు రాబట్టవచ్చు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా)
లిటన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్. రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.