IND vs BAN Test:


సీనియర్‌ పేసర్ జయదేవ్‌ ఉనద్కత్‌ మరోసారి జాక్‌పాట్‌ కొట్టేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 12 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌ టెస్టు సిరీసులో మహద్మ్‌ షమీ స్థానంలో అతడు ఎంపికయ్యాడు. ప్రస్తుతం రాజ్‌కోట్‌ ఉన్న అతడు వీసా పనులు పూర్తి చేసుకుంటున్నాడు. రెండు రోజుల్లో ఛటోగ్రామ్‌లో జట్టుతో కలవనున్నాడు.


టీ20 ప్రపంచకప్‌ నుంచి తిరిగొచ్చిన మహ్మద్‌ షమి భుజం గాయంతో బాధపడుతున్నాడు. బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌కు వెళ్లాడు. టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించినా గాయం ఇంకా మానలేదు. దాంతో దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన జయదేవ్‌ ఉనద్కత్‌ను ఎంపిక చేశారు. అతడు టెస్టు జట్టులోకి రావడం 12 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరి సారిగా 2010-11లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడాడు. సెంచూరియన్‌ టెస్టులో వికెట్లేమీ తీయకుండా 101 పరుగులు ఇచ్చాడు. అప్పట్లో అండర్‌ 19 క్రికెట్లో రాణించడంతో జాతీయ జట్టులో చోటు దక్కింది.


వేలి గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో బెంగాల్‌ క్రికెటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఎంపికయ్యాడు. అతడు ఇప్పటికే బంగ్లాదేశ్‌లో ఉన్నాడు. బంగ్లా-ఏతో టెస్టు సిరీసులో టీమ్‌ఇండియాను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. ఇక స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ప్లేస్‌లో సౌరభ్‌ కుమార్‌ను ఎంపిక చేశారు. రెండు టెస్టుల 'ఏ' టూర్‌లో అతడు 15 వికెట్లు పడగొట్టాడు.


దేశవాళీ క్రికెట్లో జయదేవ్‌ ఉనద్కత్‌ కొన్నేళ్లుగా రాణిస్తున్నాడు. సౌరాష్ట్ర జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. 2019-20లో రంజీ ట్రోఫీ అందించాడు. ఈ మధ్యే జరిగిన విజయ్‌ హాజారేలోనూ దుమ్ము రేపాడు. జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 2019-20 రంజీ సీజన్లో అతడు రికార్డు స్థాయిలో 67 వికెట్లు పడగొట్టాడు. చివరి మూడు సీజన్లలో 21 మ్యాచుల్లో 115 వికెట్లు తీశాడు. 2019 జనవరి నుంచి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అతడి సగటు 16.03గా ఉంది. ఈ సమయంలో 24 మ్యాచుల్లో 126 వికెట్లు తీశాడు. మూడుసార్లు పది వికెట్లు, తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. టీమ్‌ఇండియాకు ఆడాలన్న జ్వాల తనలో ఇంకా రగులుతూనే ఉందని జయదేవ్‌ ఈ మధ్యే చెప్పిన సంగతి తెలిసిందే.


Also Read: ఆస్ట్రేలియా మహిళల జట్టు చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిన భారత అమ్మాయిలు


Also Read: మార్చి 3వ తేదీ నుంచి మహిళల ఐపీఎల్! పోటీలో మొత్తం 5 జట్లు