IND vs BAN T20 WC: టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.30 కు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో టీమిండియానే ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. గత రికార్డులూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 11 టీ20 మ్యాచులు జరగ్గా.. భారత్ 10 విజయాలు సాధించింది. బంగ్లా ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది. రేపు మ్యాచ్ సందర్భంగా ఇంతకుముందు గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.


ఇప్పటివరకు భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు చూద్దాం.


1. అత్యధిక స్కోరు: 2009 జూన్ 6న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.


2. అత్యల్ప స్కోరు: 2016 ఫిబ్రవరి 24న మీర్ పూర్ లో జరిగిన టీ20లో బంగ్లాదేశ్ జట్టు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది.


3. అతిపెద్ద విజయం: 2016 ఫిబ్రవరిలో మీర్ పూర్ లో జరిగిన టీ20లో బంగ్లా జట్టును టీమ్ఇండియా 45 పరుగుల తేడాతో ఓడించింది. పరుగుల పరంగా భారత్ కు ఇదే అతిపెద్ద విజయం. 2014 మార్చిలో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలిచింది. వికెట్ల పరంగా ఇది అతిపెద్ద విజయం.


4. అత్యధిక పరుగులు: బంగ్లాదేశ్ తో జరిగిన టీ20ల్లో రోహిత్ శర్మ 452 పరుగులు చేశాడు. అప్పుడు అతని బ్యాటింగ్ సగటు 41.09, స్ట్రైక్ రేట్ 144.40.


5. ఉత్తమ ఇన్నింగ్స్: మార్చి 2018లో కొలంబోలో జరిగిన టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ 61 బంతుల్లో 89 పరుగులు చేశాడు.


6. అత్యధిక 50+ పరుగుల ఇన్నింగ్స్: ఈ రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే నమోదైంది. బంగ్లాదేశ్ పై హిట్ మ్యాన్ 5 సార్లు 50+ పరుగులు చేశాడు.


7. అత్యధిక సిక్సర్లు: ఈ రికార్డూ ప్రస్తుత కెప్టెన్ పేరు మీదే ఉంది. బంగ్లాదేశ్ పై రోహిత్ 21 సిక్సర్లు బాదాడు.


8. అత్యధిక వికెట్లు: భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచుల్లో యుజ్వేంద్ర చాహల్ 9 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 17, ఎకానమీ రేటు 6.37.


9. ఉత్తమ బౌలింగ్: నవంబర్ 2019లో నాగ్ పూర్ టీ20లో దీపక్ చాహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.


10. వికెట్ వెనుక అత్యధిక వికెట్లు: ఎంఎస్ ధోనీ 5 మ్యాచ్ ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. 3 క్యాచులు అందుకుని, 4 స్టంపింగ్ లు చేశాడు.