IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్. టీమిండియా విజయానికి 100 పరుగులు అవసరం. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. చూడడానికి, వినడానికి విజయ సమీకరణం తేలిగ్గానే కనిపిస్తుంది. భారత్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. కానీ అదంత తేలిక కాదు. పిచ్ అలా ఉంది మరి. మూడో రోజే బంగ్లా స్పిన్నర్ల ధాటికి 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. నాలుగో రోజు ప్రత్యర్థి స్పిన్నర్లు విజృంభించారు. మ్యాచ్ మొదలైన గంటలోపే 26 పరుగులకే మరో 3 వికెట్లు పడగొట్టారు. 71 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ కు పరాజయం తప్పదేమో అనిపించింది. అయితే


వారిద్దరూ నిలిచారు


శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ లు పట్టుదలగా నిలిచారు. ప్రతి బంతిని కాచుకుంటూ, ఒక్కో పరుగూ జోడిస్తూ స్కోరు బోర్డును నడిపించారు. ఓటమిని తప్పించారు. జట్టును గెలిపించారు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు జోడించారు. బంగ్లా ఆశలపై నీళ్లు చల్లి భారత్ కు క్లీన్ స్వీప్ విజయాన్ని అందించారు. ప్రత్యర్థి బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లతో రాణించాడు. కెప్టెన్ షకీబుల్ హసన్ 2 వికెట్లు తీశాడు. 


తొలి గంట బంగ్లాదే


45 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. బంగ్లా స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్ లో ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ అక్షర్ పటేల్ (34) కుదురుగా ఆడుతున్నప్పటికీ.. మరోవైపు క్రమంగా వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్ మెన్ ఉనద్కత్ (16) ను షకీబ్ ఔట్ చేయగా.. పంత్ (9)ను మిరాజ్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే మిరాజ్ ఇండియాకు మరో షాక్ ఇచ్చాడు. కుదురుకున్న ఆడుతున్న అక్షర్ ను పెవిలియన్ పంపించాడు. దీంతో 71 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ కు ఓటమి తప్పదనిపించింది.


ఆ దశలో శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ లు పట్టుదలగా నిలిచారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ఇబ్బందిలేకుండా బ్యాటింగ్ చేశాడు. అప్పటివరకు భారత్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బందిపెట్టిన బంగ్లా స్పిన్నర్లను శ్రేయస్ అవలీలగా ఎదుర్కొన్నాడు. పరీక్ష పెట్టిన బంతులను చక్కగా డిఫెన్స్ ఆడుతూనే గతితప్పిన వాటిని బౌండరీకి తరలించాడు. మరోవైపు ఒక పరుగు వద్ద మోమినల్ హక్ క్యాచ్ వదిలేయటంతో బతికిపోయిన అశ్విన్ ఆచితూచి ఆడుతూ శ్రేయస్ (29) కు సహకరించాడు. అయితే చివరి 4 ఓవర్లలో శ్రేయస్ కన్నా ఎక్కువగా అశ్విన్  (42) స్ట్రైక్ తీసుకుని చెలరేగాడు. చివరి ఓవర్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో చెలరేగి భారత్ కు విజయాన్ని అందించాడు. 


మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అశ్విన్ ఎంపికయ్యాడు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఛతేశ్వర్ పుజారా అందుకున్నాడు. ఈ విజయంతో భారత్ ను 2 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లను పెంచుకుంది.