BCCI Selection Committee: ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యం తర్వాత బీసీసీఐ సెలక్షన్ కమిటీని రద్దు చేసింది. అయితే నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొత్త కమిటీని ఏర్పాటు చేయలేదు. కమిటీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.  జనవరి 3 నుంచి భారత్ లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ సిరీస్ కు తాత్కాలిక సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేయాల్సి వచ్చింది. 


ఇటీవల బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై బీసీసీఐ దృష్టి పెట్టనుంది. న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు సమాచారం. అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఇంటర్య్వూలు నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారంలో బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కావచ్చు. అలాగే కొత్త సంవత్సరంలోనే రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోనున్నారు. 


జనవరిలో కొత్త కమిటీ!


జనవరి 18 నుంచి కివీస్ తో సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికోసం జట్టును ప్రకటించడానికి 15 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి అప్పటికల్లా కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలనే ఆలోచనతో బీసీసీఐ ఉంది. ఒకవేళ అప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటు పూర్తికాకపోతే చేతన్ శర్మ నేతృత్వంలోని పాత కమిటీకే జట్టు ప్రకటన బాధ్యతలు అప్పగించవచ్చు. కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు సమయం పడుతుంది. జనవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని చూస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఇంటర్వ్యూ చేయడానికి కనీసం 10 రోజులు పడుతుంది. క్రిస్ట్ మస్ తర్వాత చేతన్ శర్మను మేం కాంటాక్ట్ చేస్తాం అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 


కొత్త సెలక్షన్ కమిటీ తీసుకోవలసిన వాటిలో కీలక నిర్ణయాలివి 



  • ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక

  • రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీపై నిర్ణయం.

  • టీ20 జట్టులో కేఎల్ రాహుల్ స్థానం ఏంటి అనే దానిపై నిర్ణయం.

  • T20 ప్రపంచ కప్ 2024 కోసం బ్లూప్రింట్.


కొత్త ఎంపిక కమిటీని ఎవరు నియమిస్తారు?


CAC ఇప్పుడు షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తుంది. మాజీ సెలక్టర్ చేతన్ శర్మ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతడిని మరలా ఎంపిక చేయడంపై బీసీసీఐ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కొత్త సెలక్షన్ కమిటీ అధ్యక్షుడి రేసులో వెంకటేశ్ ప్రసాద్, సలీల్ అంకోలా, అశిష్ షెలార్, నయన్ మోంగియా లాంటి ప్రముఖులు ఉన్నారు.