IND vs BAN 1st Test:
మొదట్లో తడబడింది! ఆపై పోరాడింది! చివరికి నిలబడింది! ఛటోగ్రామ్ టెస్టులో తొలిరోజు టీమ్‌ఇండియా ఆటతీరిది! తొలి సెషన్లోనే మూడు వికెట్లు పోగొట్టుకొని అల్లాడిన భారత్ బుధవారం ఆట ముగిసే సరికి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. 90 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (82 బ్యాటింగ్; 169 బంతుల్లో 10x4) అజేయంగా నిలిచాడు. నయావాల్ చెతేశ్వర్ పుజారా (90; 203 బంతుల్లో 11x4) త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. రిషభ్ పంత్ (46; 45 బంతుల్లో 6x4, 2x6) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తైజుల్ ఇస్లామ్ 3, మెహదీ హసన్ 2 వికెట్లు పడగొట్టారు.
తొలి సెషన్లో బంగ్లా పైచేయి
మొదట బ్యాటింగుకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. నిలకడగా ఆడిన కేఎల్ రాహుల్ (22; 54 బంతుల్లో 3x4), శుభ్‌మన్ గిల్ (20; 40 బంతుల్లో 3x4) కేవలం 4 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. జట్టు స్కోరు 41 వద్ద గిల్‌ను తైజుల్ ఇస్లామ్ ఔట్ చేయగా మరికాసేపటికే ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని రాహుల్ వికెట్ల మీదకు ఆడుకున్నాడు. మరో 3 పరుగులకే ఆదుకుంటాడని భావించిన విరాట్ కోహ్లీ (1) ఔటవ్వడంతో 85/3తో భారత్ భోజన విరామం తీసుకుంది.
పోరాడిన పంత్, పుజారా
రెండో సెషన్లో చెతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ అద్భుతంగా ఆడారు. నాలుగో వికెట్‌కు 73 బంతుల్లో 64 రన్స్ భాగస్వామ్యం అందించారు. అన్ ఈవెన్ బౌన్స్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పుజారా ఎక్కువగా డిఫెండ్ చేయగా పంత్ బంతికో పరుగు చొప్పున సాధించాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్ల విశ్వాసం దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతడిని మెహదీ హసన్ బౌల్డ్ చేశాడు. కాగా పంత్ అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు మైలురాయి అధిగమించాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో 174/4తో భారత్ తేనీటి విరామానికి వెళ్లింది.
భేష్.. పుజారా, శ్రేయస్ భాగస్వామ్యం
ఆఖరి సెషన్లో పుజారా, శ్రేయస్ ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే! వీరిద్దరూ బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. మంచి బంతుల్ని గౌరవిస్తూ చెత్త బంతుల్ని బౌండరీకి పంపించారు. పుజారా 125 బంతుల్లో, శ్రేయస్ 93 బంతుల్లో అర్ధశతకాలు బాదేశారు. వీరిద్దరినీ ఎలా ఔట్ చేయాలో ప్రత్యర్థి బౌలర్లకు అర్థమవ్వలేదు. నయావాల్ ఒకప్పట్లా స్థిరంగా బ్యాటింగ్ చేయడం అభిమానులను అలరించింది. కాగా 10 బంతుల్లో శతకం చేస్తాడనగా 84.2వ బంతికి పుజారా బౌల్డ్ అయ్యాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన బంతి బ్యాటు అంచుకు తగిలి వికెట్ల వైపు వెళ్లింది. దాంతో 5వ వికెట్‌కు 317 బంతుల్లో 149 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయస్ క్రీజులో నిలిచినా 89.6వ బంతికి అక్షర్ పటేల్ (14) ఔటవ్వడతో ఆట ముగిసింది.