IND vs BAN 1st Test:
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. తొలి సెషన్లోనే 3 వికెట్లు నష్టపోయింది. టాప్ ఆర్డర్లో ఎవ్వరూ హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. 40 ఓవర్లు ముగిసే భారత్ 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. నయావాల్ చెతేశ్వర్ పుజారా (27; 71 బంతుల్లో 3x4), శ్రేయస్ అయ్యర్ (10; 26 బంతుల్లో 1x4) నిలకడగా ఆడుతున్నారు. వికెట్లు పడకుండా అడ్డుకుంటున్నారు. పిచ్ విపరీతంగా స్పందిస్తోంది. అన్‌ఈవెన్ బౌన్స్‌తో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.
కొద్ది సేపట్లోనే ముగ్గురు
ఛటోగ్రామ్ వేదికగా సాగుతున్న పోరులో టాస్ గెలిచిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గాయపడటంతో కేఎల్ రాహుల్ (22; 54 బంతుల్లో 3x4) నాయకత్వం వహిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ (20; 40 బంతుల్లో 3x4)తో కలిసి ఓపెనింగ్‌కు దిగాడు. మొదట్లో నిలకడగా ఆడిన వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. జట్టు స్కోరు 41 వద్ద గిల్‌ను తైజుల్ ఇస్లామ్ ఔట్ చేశాడు. మరికాసేపటికే ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని రాహుల్ వికెట్ల మీదకు ఆడుకున్నాడు. తక్కువ బౌన్స్‌తో ఆఫ్‌సైడ్ వచ్చిన బంతి బ్యాటు అంచుకు తగిలి వికెట్లను గిరాటేసింది.
కోహ్లీ షాక్!
మరో 3 పరుగులకే ఇస్లామ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (1) ఔటవ్వడంతో టీమ్‌ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఈ క్రమంలో చెతేశ్వర్ పుజారాతో కలిసి వికెట్ కీపర్ రిషభ్ పంత్ (46; 45 బంతుల్లో 6x4, 2x6) జట్టును ఆదుకున్నాడు. బంతికో పరుగు చొప్పున సాధించాడు. చూడచక్కని బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. హాఫ్ సెంచరీకి మరో 4 పరుగుల దూరంలో మెహదీ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు మైలురాయి అందుకున్నాడు. ప్రస్తుతం పుజారా, శ్రేయస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దతున్నారు. భోజన విరామానికి 85/3తో నిలిచిన టీమ్‌ఇండియాను డ్రింక్స్ సమయానికి 128/4కి తీసుకెళ్లారు.