IND vs BAN 1st Test: భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. లంచ్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేశారు. రిషభ్ పంత్ 29, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో రిషభ్ పంత్ 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్సును కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ లు ప్రారంభించారు. వీరిద్దరూ ఆచితూచి ఆఢుతూ స్కోరు బోర్డును నడిపించారు. పిచ్ బౌలింగ్ కు సహకరించటంతో ఈ జంట నెమ్మదిగా ఆడింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ భారత బ్యాటర్లను పరీక్షించారు. మొదటి వికెట్ కు 41 పరుగులు జోడించాక ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లో రాహుల్ బౌల్డయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా తైజుల్ ఇస్లాంకు వికెట్ల ముందు దొరికిపోయాడు. తర్వాత భారత్ కు  పెద్ద షాక్ తగిలింది. మూడో వన్డేలో సెంచరీ చేసి మంచి ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీ 5 బంతులు మాత్రమే ఆడి ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. కోహ్లీ వికెట్ ను కూడా తైజులే తీశాడు. దీంతో భారత్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 


కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ దూకుడుగా ఆడాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మరోవైపు పుజారా స్ట్రైక్ రొటేట్ చేస్తూ పంత్ కు సహకరించాడు. వీరిద్దరూ ఇప్పటివరకు నాలుగో వికెట్ కు 37 పరుగులు జోడించారు. లంచ్ సమయానికి పంత్ 29, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 2, ఖలీద్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. 


 






 


ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు స్పిన్... మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ లు పేసర్లుగా ఉన్నారు. 


భారత్ తుది జట్టు 


శుభమన్ గిల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.


బంగ్లాదేశ్ తుది జట్టు


జాకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్.