IND vs BAN 1st Test: భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సమరానికి సమయం ఆసన్నమైంది. రేపటి (డిసెంబర్ 14) నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అయితే రెండు జట్లలోనూ కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. రేపు ఉదయం 9.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. 


టీమిండియాకు గాయాల బెడద


ఇప్పటికే బంగ్లా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ ను గాయాలు వేధిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వేలి గాయంతో ఆడడంలేదు. అతని ప్లేస్ లో అభిమన్యు ఈశ్వరన్ ను ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలు పూర్తిగా కోలుకోకపోవటంతో వారి స్థానంలో సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలు జట్టులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రాహుల్ కు తోడుగా శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. పుజారా, కోహ్లీ, పంత్ మిడిలార్డర్ భారాన్ని మోయనున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే ఉమేష్ యాదవ్,  జైదేవ్ ఉనద్కత్ లు అనుభవజ్ఞులే అయినప్పటికీ వారు జాతీయ జట్టుకు ఆడి చాలాకాలం అవుతుంది.  సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లు ఏ మేర ఆకట్టుకుంటారో చూడాలి. స్పిన్ భారాన్ని అశ్విన్, అక్షర్ పటేల్ మోయనున్నారు. 


బంగ్లాను వీడని గాయాలు


బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ షకీబుల్ హసన్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా షకీబ్ ఆసుపత్రిలో చేరాడు. నిన్న ప్రాక్టీస్ సెషన్ లోనూ పాల్గొనలేదు. అయితే అతను ఆడేది లేనిది స్పష్టత లేదు. ఒకవేళ షకీబ్ దూరమైతే అది బంగ్లాకు పెద్ద లోటే. అయితే వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఉత్సాహంతో ఉంది. నజ్ముల్ హొస్సేన్, మోమినుల్ హక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, షరీఫుల్ ఇస్లాం వంటి ఆటగాళ్లు వారికి ఉన్నారు. 


ఎప్పుడు, ఎక్కడ


రేపు చట్టోగ్రామ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. జహుర్ అహ్మద్ చౌదరి మైదానంలో ఈ మ్యాచ్ ఆడనున్నారు. 


ఎక్కడ చూడవచ్చు


భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సోనీ లివ్ యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 


భారత తుది జట్టు (అంచనా)


లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, జైదైవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్. 


బంగ్లాదేశ్ తుది జట్టు (అంచనా)


షకీబుల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్టేన్, మోమినల్ హక్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, షరీఫుల్ ఇస్లాం, జకీర్ హసన్, మహ్మదుల్ హసన్, రాజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్.