Abhimanyu Easwaran: రేపట్నుంచి బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో గాయపడి మొదటి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో సెలక్షన్ కమిటీ అభిమన్యు ఈశ్వరన్ ను జట్టులోకి ఎంపిక చేసింది. అభిమన్యు దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణించాడు. టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. అందుకే టీమిండియాలోకి వచ్చాడు. మరి లిస్ట్ ఏ క్రికెట్ లో అతని గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దామా..
డెహ్రాడూన్ లో పుట్టిన అభిమన్యు ఈశ్వరన్ 2013లో బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. 2015లో మధ్యప్రదేశ్ పై లిస్ట్ ఏ క్రికెట్లోకి వచ్చాడు. 27 ఏళ్ల అభిమన్యు టాపార్డర్ బ్యాట్స్ మెన్. అలాగే లెగ్ బ్రేక్ బౌలర్. ఈశ్వరన్ 134 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. 45. 33 సగటుతో 2276 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 233. లిస్ట్ ఏ క్రికెట్ లో బెంగాల్ తరఫున 76 ఇన్నింగ్సుల్లో 3376 పరుగులు సాధించాడు. సగటు 46. 24. అతని ఖాతాలో 18 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 2 వికెట్లు తీశాడు.
ఇంత అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి కాబట్టే జాతీయ జట్టులోకి ప్రవేశం పొందగలిగాడు. మరి బంగ్లాతో టెస్టుల్లో తుది జట్టులో అవకాశమొస్తే ఎలా ఆడతాడో చూడాలి.
తాజాగా జరిగిన ఇండియా ఏ మ్యాచులో అభిమన్యు ఈశ్వరన్ రెండు శతకాలు నమోదుచేశాడు. ఓపెనర్ గానూ ఆడుతున్నాడు. ఈశ్వరన్ తొలి ఏ టెస్టులో 141 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 154 పరుగులు చేశాడు. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఈశ్వరన్ కు రోహిత్ స్థానం దొరికింది.
రంజీ టోర్నీకి వేళాయే
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. 38 జట్ల మధ్య జరిగే ఈ పోటీకి మంగళవారం తెరలేవనుంది. ఈ టోర్నీలో మొత్తం 135 మ్యాచులు ఆడనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని కుదించి నిర్వహించారు. అయితే ఈసారి పూర్తిస్థాయిలో దీన్ని నిర్వహించనున్నారు. ముంబయి, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, సౌరాష్ట్ర, విదర్భ, దిల్లీ ట్రోఫీ రేసులో ఉన్నాయి. 38 జట్ల మధ్య జరిగే ఈ పోటీకి మంగళవారం తెరలేవనుంది. తెలుగు జట్లు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎలైట్ గ్రూప్- బి లో పోటీపడనున్నాయి. హైదరాబాద్ సొంతగడ్డపై తన తొలి మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడనుండగా.. ఇదే గ్రూపులో ఆంధ్ర విజయనగరంలో ముంబయిని ఢీకొంటుంది.