Sanjay Bangar on Kohli: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని.. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కోహ్లీ ఆస్ట్రేలియాతో ఆడడాన్ని ఇష్టపడతాడని.. అతని ఆటను మెరుగుపరచడంలో అది సహాయపడుతుందని అతను తెలిపాడు.
ఫిబ్రవరి 9 నుంచి భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే రెండు జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని సంజయ్ బంగర్ అన్నారు. అలాగే సుదీర్ఘ ఫార్మాట్ లో సెంచరీల కరవును తీర్చుకుంటాడని తెలిపారు. నవంబర్ 2019లో బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో సెంచరీ తర్వాత కోహ్లీ ఇప్పటివరకు మళ్లీ ఈ ఫార్మాట్ లో మూడంకెల స్కోరును అందుకోలేదు. గతేడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన 2 మ్యాచుల టెస్ట్ సిరీస్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు. భారత్ ఆ సిరీస్ ను గెలుచుకున్నప్పటికీ విరాట్ కోహ్లీ 4 ఇన్నింగ్సుల్లో కేవలం 45 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
ఆస్ట్రేలియాపై అదరగొడతాడు
అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్ లో మంచి ఫాంలో ఉన్నాడు. ఈ 2 నెలల కాలంలో వన్డేల్లో 3 శతకాలు బాదాడు. 'పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అత్యుత్తమ ఫాంకి తిరిగి రావడం విరాట్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ఆస్ట్రేలియాపై కోహ్లీకి మంచి గణాంకాలు ఉన్నాయి. ఆ దేశంతో ఆడడాన్ని విరాట్ ఎంజాయ్ చేస్తాడు. టెస్ట్ క్రికెట్ అనేది విరాట్ కోహ్లీ నుంచి తన అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తుంది.' అని సంజయ్ బంగర్ తెలిపాడు. ఆస్ట్రేలియాపై 20 టెస్టుల్లో కోహ్లీ 7 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు సహా 1682 పరుగులు చేశాడు.
స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గైర్హాజరీలో కోహ్లీ చేసే పరుగులు చాలా కీలకం కానున్నాయని బంగర్ అభిప్రాయపడ్డాడు. 'గత రెండున్నరేళ్లుగా కోహ్లీ తన ప్రమాణాల ప్రకారం ఆడడంలేదు. అయితే ప్రస్తుతం టీ20, వన్డేల్లో ఫాంలోకి వచ్చాడు. అదే జోరును సుదీర్ఘ ఫార్మాట్లోనూ చూపించాలని అనుకుంటున్నాడు. అలా చేయగలడని మేం ఆశాభావంతో ఉన్నాం. ఈ ఫార్మాట్ లో ఎదురయ్యే సవాళ్లను కోహ్లీ అధిగమిస్తాడు. ' అని సంజయ్ బంగర్ తెలిపాడు.
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో అందరి దృష్టి భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఈ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరగనుంది. ఈ మైదానంలో విరాట్ కోహ్లి రికార్డును మామూలుగా లేదు. కోహ్లి ఇక్కడ మూడు మ్యాచ్‌ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుండి రెండు సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా వచ్చాయి. అందులో కోహ్లీ ఒక ఇన్నింగ్స్‌లో 213 పరుగులు కూడా చేశాడు.