Ind Vs Aus T20 Tickets Sales Started: ప్రపంచ కప్ తరువాత ఆస్ట్రేలియా(Australia) తో సిరీస్ కు టీమిండియా(India) సిద్ధమవుతోంది. విశాఖ( Visakhapatnam) వేదికగా ఈ నెల 23న జరగనున్న మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు (బుధవారం) నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నేడు, రేపు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(ఇన్‌సైడర్.ఇన్)లో టికెట్లు పొందవచ్చన్నారు.
నవంబర్ 19న ప్రపంచకప్ ముగిసిన తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో.. టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ 20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా మారనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు 17, 18 తేదీల్లో విశాఖపట్నం పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయించనున్నట్లు డీసీపీ కె.శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆఫ్‌లైన్‌లో ఒకరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తారని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో 10,500, ఆఫ్‌లైన్‌లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయన్నారు.
అభిమానులు సహకరించాలి:
క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు పోలీసులకు సహకరించాలని డీసీపీ–1 కోరారు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని వాహనాలు పార్కింగ్ విషయంలో నియమాలను పాటించాలనారు. స్టేడియంకు విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దన్నారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ఒక ప్రత్యేక మార్కు ఉండేలా డిజైన్ చేశామని,స్కాన్‌లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. దానికి ఎవరూ బాధ్యత వహించరని, ఎటువంటి కారణాలు చెప్పినా మ్యాచ్ కు అనుమతించేది లేదు సరికదా అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక భారత్‌తో జరిగే ఈ టీ 20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు.. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది. జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాలకు స్థానం దక్కింది. ఆసిస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. వరల్డ్‌కప్‌లో ఆడుతున్న కమ్మిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ లకు విశ్రాంతి ఇచ్చారు. ప్రపంచకప్ తర్వాత వీరు స్వదేశం తిరిగి వెళ్లనున్నారు.
టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.