Bhuvneshwar kumar: భువనేశ్వర్ కుమార్! టీమ్‌ఇండియా స్వింగ్ కింగ్! అతడు ఇన్‌స్వింగర్ విసిరితే వికెట్లు ఎగిరిపడతాయి. అతడు ఔట్ స్వింగర్ సంధిస్తే కీపర్, ఫస్ట్‌స్లిప్‌లో క్యాచ్ కంపల్సరీ! కొన్నిసార్లు అతడి నకుల్ బంతులకు బ్యాటర్ల వద్ద జవాబే ఉండదు. కచ్చితత్వంతో అతడు వైడ్ యార్కర్లు విసిరితే ప్రత్యర్థి ఓటమి ఖాయమే!
ఎందుకో తెలీదు! భువీ ఈ మధ్యన గాడి తప్పుతున్నాడు. నిలకడ కోల్పోతున్నాడు. వైవిధ్యం ప్రదర్శించడం లేదు. కొన్ని మ్యాచుల్లో వికెట్లు పడగొడుతున్నాడు. మరికొన్నింట్లో పరుగుల్ని నియంత్రిస్తున్నాడు. కానీ అదేంటో! అత్యంత కీలకమైన పోరాటాల్లో అటు వికెట్లు తీయక, ఇటు డెత్ ఓవర్లలో రన్స్ కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకీ అతడికేమైంది!!
విలువైన గని!
భారత్‌కు దొరికిన విలువైన పేసర్ భువీ. చాన్నాళ్ల వరకు ఇండియాలో మీడియం పేసర్లే ఉండేవారు. వైవిధ్యం తక్కువ. అలాంటి టైమ్‌లో ఈ యూపీ కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. కాలం గడిచే కొద్దీ నకుల్ , హాఫ్ వ్యాలీలు, వైడ్ యార్కర్లు, యార్కర్ల వంటి అస్త్రాలు అమ్ములపొదిలో పోగేసుకున్నాడు. 2016 టైమ్‌లోనైతే అతడి బౌలింగ్‌కు ఎదురేలేదు. చక్కని రన్నప్, అద్భుతమైన లయతో వికెట్లు పడగొడుతుంటే ఆనందం వేసేది. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో మైండ్ గేమ్‌తో వికెట్లు తీసి ప్రత్యర్థులను దెబ్బకొట్టేవాడు. ఆ ఏడాది సన్‌రైజర్స్ ఐపీఎల్ గెలిచిందంటే అతడే ప్రధాన కారణం.
పవర్‌ప్లేలో బ్యూటీఫుల్!
ఇప్పటి వరకు భువీ అంతర్జాతీయ క్రికెట్లో 220 మ్యాచులాడాడు. 4.70 ఎకానమీ, 29.42 సగటుతో 288 వికెట్లు పడగొట్టాడు. 78 టీ20ల్లో 22.35 సగటు, 6.95 ఎకానమీతో 84 వికెట్లు తీశాడు. మూడు సార్లు 4, రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇందులో ఆఖరి 4 ఓవర్లలో తీసిన వికెట్లే 31. ఎకానమీ 9.49, సగటు 21.38. పవర్ ప్లే ఓవర్లలో అయితే 5.69 ఎకానమీ, 21.46 సగటుతో 43 వికెట్లు పడగొట్టాడు. అంటే ఆరంభ, ఆఖరి ఓవర్లలో అతడో ప్రధాన అస్త్రం! ఈ ఏడాది టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిందీ భువీనే. 22 ఇన్నింగ్సుల్లో 6.97 ఎకానమీ, 16.87 సగటుతో 31 వికెట్లు పడగొట్టాడు. గణాంకాలను బట్టి అతడి స్టాండర్డ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిలకడగా ఛాన్స్‌లు
ఈ ఏడాది టీమ్‌ఇండియా తరఫున ఎక్కువ టీ20లు ఆడింది భువీనే. సెలక్టర్లు నిలకడగా అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడు అత్యంత కీలకం. బౌన్స్‌తో కూడిన అక్కడి పిచ్‌లపై ప్రభావం చూపించగలడు. ఇక స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించగలడు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో భువీ బౌలింగ్‌పై డౌట్లు పెరుగుతున్నాయి. ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొట్టిన అతడు ఇంపార్టెంట్ సిచ్యువేషన్‌లో మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఒత్తిడి తట్టుకోవడం లేదు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో వికెట్లు తీయడంలో తడబడుతున్నాడు. 10 పైగా ఎకానమీతో రన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇందుకు కారణాలేంటో అర్థమవ్వడం లేదు.
19వ ఓవర్లో తడబాటు!
ఆసియాకప్ ఆరంభ మ్యాచులో పాక్‌పై 6.5 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టి 26 రన్స్ ఇచ్చాడు. అఫ్గాన్ మ్యాచులో 4 ఓవర్లలో 4 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అదే భువీ సూపర్4లో పాక్‌పై 1 వికెట్ తీసి 40 రన్స్ ఇచ్చాడు. 19వ ఓవర్లో 19 రన్స్ ఇవ్వడంతో మ్యాచ్ చేజారింది. శ్రీలంకపై వికెట్లేమీ తీయకుండానే 30 రన్స్ ఇచ్చాడు. 19వ ఓవర్లోనే 14 రన్స్ ఇచ్చాడు. అంటే మొత్తం రన్స్‌లో సగం. దాంతో ఆఖరి ఓవర్లో 7 రన్స్ డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి. తాజాగా ఆసీస్ మ్యాచులో 13 ఎకానమీతో 52 రన్స్ ఇచ్చాడు. 17, 19 ఓవర్లలో 15 చొప్పున 30 రన్స్ ఇవ్వడం గమనార్హం. మూమెంటమ్‌ను షిప్ట్ చేయాల్సిన ఓవర్లలో అతడు ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు అవే ఓవర్లను అద్భుతంగా విసిరేవాడు. బహుశా పని ఒత్తిడి వల్ల అతడు అలసిపోయి ఉండొచ్చు. ఎందుకంటే టీమ్‌ఇండియా ఈ ఏడాది 27 టీ20లు ఆడితే అతడు 23 ఆడాడు. అతడికి మరో బౌలర్ నుంచి సహకారం అందడం లేదేమో. బహుశా బుమ్రా, అర్షదీప్ తోడైతే అతడి బౌలింగ్ ప్రమాదకరంగా మారొచ్చేమో. ఏం జరుగుతుందో చూడాలి మరి!!