India vs Australi 2nd T20 Preview: మొహాలి కథ ముగిసింది! నాగ్‌పుర్‌లో సిసలైన సమరం వెయిట్‌ చేస్తోంది. తొలి టీ20కి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంది. తమ బౌలింగ్‌ వాడిని ప్రదర్శించాలని తహతహలాడుతోంది. మరోవైపు మ్యాచ్‌ గెలిచి 2-0తో సిరీస్‌ పట్టేయాలన్న కసితో కంగారూలు ఉన్నారు. మరి రెండో టీ20లో గెలుపెవరిది? తుది జట్లలో ఎవరుంటారు? పిచ్‌ ఎలా ఉంటుంది?


బౌలింగ్‌తోనే పరేషాన్‌!


తొలి టీ20లో టీమ్‌ఇండియా 208 పరుగులను డిఫెండ్‌ చేసుకోలేకపోతుందని ఎవరూ ఊహించలేదు. కొన్నిరోజుల ముందు వరకు బ్యాటింగ్‌ పరంగా సమస్యలుండేవి. ఇప్పుడు వారికి బౌలర్లు జత కలిశారు. మిడిల్‌, డెత్‌ ఓవర్లలో వికెట్లేమీ తీయడం లేదు. రెండో టీ20లో కచ్చితంగా దీనికి సమాధానం వెతికేందుకు రోహిత్‌ సేన ప్రయత్నిస్తుంది.


టాప్‌ టు లోయర్‌ ఆర్డర్‌ వరకు బ్యాటింగ్‌ పరంగా ఇబ్బందులేం లేవు. రాహుల్‌, కోహ్లీ, సూర్య, పాండ్య ఫామ్‌లో ఉన్నారు. రోహిత్‌, డీకే ఆడితే ఎలా ఉంటుందో తెలిసిందే. నాగ్‌పుర్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి భువీ కీలకం అవుతాడు. అతడిపై ఆశలు పెట్టుకోవాలో లేదో నేడు తెలిసిపోతుంది. యూజీ చాహల్‌ బదులు అశ్విన్ రావొచ్చు. ఫిట్‌గా ఉంటే ఉమేశ్‌ స్థానంలో బుమ్రా రావడం ఖాయం.


కీలక ప్లేయర్లు లేకున్నా!


డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా మరోసారి ప్రపంచ కప్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీసును సన్నాహకంగా తమను తాము పరీక్షించుకుంటోంది. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టాయినిస్‌ లేనప్పటికీ బాగానే రాణించింది. ఆరోన్‌ ఫించ్‌ మళ్లీ గాడిన పడుతున్నాడు. ఫినిషర్‌గా వచ్చే కామెరాన్‌ గ్రీన్‌ ఓపెనర్‌గా రాణించడం కలిసొచ్చే అంశం. మాక్సీ, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌తో బ్యాటింగ్‌ బలంగా ఉంది. బౌలింగ్‌ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయి. హేజిల్‌వుడ్, కమిన్స్‌లో ఎవరికైనా రెస్ట్‌ ఇవ్వాలనుకుంటే సేన్‌ అబాట్‌ వస్తాడు. నేథన్‌ ఇల్లిస్‌ పరుగులు ఇచ్చినా వికెట్లు తీస్తున్నాడు. గాయం కారణంగా కేన్‌ రిచర్డ్‌ రెండో మ్యాచుకూ అందుబాటులో ఉండడు.


India vs Australia Teams (అంచనా)


భారత్‌: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా / ఉమేశ్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ / రవిచంద్రన్ అశ్విన్‌


ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌, కామెరాన్‌ గ్రీన్‌, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జోస్‌ ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌, కమిన్స్‌, నేథన్ ఇల్లిస్‌, ఆడమ్‌ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌


నాగ్‌పుర్‌ కంచుకోట


మొహాలితో పోలిస్తే నాగ్‌పుర్‌ పిచ్‌ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఇక్కడ 12 టీ20లు జరిగితే తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 151గా ఉంది. 2019లో చివరిసారి బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా ఇక్కడ తలపడింది. దీపక్‌ చాహర్‌ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. స్వింగ్‌కు అనుకూలిస్తుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లకే గెలుపు అవకాశాలు ఎక్కువ. 12 టీ20ల్లో 9 అలాగే గెలిచాయి.