Virat Kohli Record: 2023 ప్రపంచకప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ రోజు హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాతే అవుట్ అయ్యాడు. 29వ ఓవర్ మూడో బంతికి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 


ఫైనల్లో హాఫ్ సెంచరీ..


కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 10.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే విరాట్ తన హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 29వ ఓవర్‌లో వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ నాలుగో వికెట్‌కు 109 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


ఈ హాఫ్ సెంచరీతో టోర్నీలో కోహ్లీ 750 పరుగుల మార్కును దాటాడు. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో 750+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. హాఫ్ సెంచరీతో 48 ఏళ్ల ప్రపంచకప్‌లో సెమీఫైనల్, ఫైనల్లో 50+ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించాడు. కివీస్ జట్టుపై 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు.


ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా తరఫున టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ కొంత వరకు విజయవంతమైంది.