Rohit Sharma News Record In World Cup 2023 Final: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ తక్కువ సమయంలోనే కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా ఒక ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు.


రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
ఈ ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 11 మ్యాచ్‌ల్లో మొత్తం 597 పరుగులు చేశాడు. ఇది ప్రపంచ కప్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని ఘనత. అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు హిట్‌మ్యాన్. ఈ రికార్డులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మరో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ పేరు మీద ఉండేది. ఇప్పుడు రోహిత్ శర్మ వాళ్లను అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. 


2019 ప్రపంచకప్‌లో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా 578 పరుగులు చేశాడు. 2007 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా మహేల జయవర్ధనే 548 పరుగులు చేశాడు. 2003 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ 539 పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ 2019 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా 507 పరుగులు చేశాడు.


వరల్డ్ కప్‌లో 10 మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ముగ్గురు స్టార్ బ్యాట్స్‌మెన్లు త్వరగానే పెవిలియన్‌కు చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వికెట్లను వంద పరుగుల లోపే టీమిండియా కోల్పోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆడినట్టే కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులకే అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్ కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. గిల్ వికెట్ పడగానే విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వికెట్ పడటంతో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. కోహ్లీ హాఫ్‌ సెంచరీ దిశగా ఆడుతున్నాడు. ప్రపంచకప్ 2023 తొలి లీగ్ మ్యాచ్‌లో  ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 85, కేఎల్ రాహుల్ 97* పరుగులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఇరువురు ఆటగాళ్ల నుంచి ఇదే ఆశిస్తున్నారు.


భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. ఫైనల్లో హిట్‌మ్యాన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. 10వ ఓవర్ నాలుగో బంతికి గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ చేతిలో రోహిత్ శర్మ అవుటయ్యాడు. అయితే సెమీఫైనల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయంగా 80 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ఫైనల్లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ రెండో బంతికి మిచెల్ స్టార్క్ చేతిరి గిల్ చిక్కాడు.