బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఈరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. కానీ చివరల్లో తడబాటుకు లోనైంది. దాంతో 200కు పైగా వస్తుందనుకున్న ఆధిక్యం 91 కే పరిమితమైంది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ(186) కి తోడు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (79)తో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రత్యర్థి ఆసీస్ 6 ఓవర్లలో 3 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(3), కునెమన్ క్రీజులో ఉన్నారు. ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 88 పరుగులు వెనుకంజలో ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 289/3తో నాలుగో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడింది. 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ చాన్నాళ్ల తర్వాత చూడచక్కని షాట్లతో చెలరేగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఎట్టకేలకు మరో టెస్టు శతకం నమోదు చేశాడు. అయితే రన్ మేషిన్ కోహ్లీకి టెస్టుల్లో దాదాపు 1200 రోజుల తరువాత చేసిన సెంచరీ కావడంతో ఇది చాలా ప్రత్యేకం. ఇటీవల వన్డేలు, టీ20ల్లో శతకాలు బాది కమ్ బ్యాక్ చేసిన కోహ్లీ తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన శతకం బాదాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 28వ శతకం కాగా, ఓవరాల్ గా విరాట్ ఇంటర్నేషనల్ కెరీర్ లో 75వ సెంచరీ మార్క్ చేరుకున్నాడు.
రవీంద్ర జడేజా (28; 84 బంతుల్లో 2x4, 1x6)ని జట్టు స్కోరు 309 వద్ద టాడ్ మర్ఫీ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్ ఆచితూచి ఆడాడు. చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కోహ్లీకి బ్యాటింగ్ ఇచ్చాడు. శ్రీకర్ భరత్ (44; 88 బంతుల్లో 2x4, 3x6) ఆచితూచి ఆడాడు. లంచ్ వరకు 362/4 స్కోర్‌తో ఉన్న భారత్ ఆపై టీ బ్రేక్ సమయానికి భారత్ 158 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 472 పరుగులు చేసింది.
కీలక భాగస్వామ్యం..
అక్షర్ పటేల్ తో కలిసి కోహ్లీ భారత ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఓ దశలో అక్షర్ సెంచరీ, కోహ్లీ డబుల్ సెంచరీ చేస్తారమో అనేలా మంచి టచ్ లో కనిపించారు. 175 పరుగుల భాగస్వామ్యం అనంతరం జట్టు స్కోరు 555 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది భారత్. స్టీవ్ స్మిత్ పేసర్ మిచెల్ స్టార్క్ కు బంతినివ్వగా.. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ అక్షర్ పటేల్ (79; 113 బంతుల్లో 2x4, 4x6) ను బౌల్డ్ చేశాడు స్టార్క్.
16 పరుగుల తేడాలో 4 వికెట్లు
భారీ ఆధిక్యం వస్తుందనేలా కనిపించిన భారత్ చివర్లో తడబాటుకు లోనైంది. 555 పరుగులకు 5 వికెట్లుగా ఉన్న భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్(79) ను స్టార్క్ బౌల్డ్ చేయగా, వెంట వెంటనే మిగతా మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. అశ్విన్ (7), ఉమేష్ డకౌట్ అయ్యారు. చివరి వికెట్ గా మాజీ కెప్టెన్ కోహ్లీ వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ 571కు పరిమితమైంది. కేవలం 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కోహ్లీ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్ ముర్ఫీ బౌలింగ్ లో కోహ్లీ (364 బంతుల్లో 186, 15 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్ లబుషేన్ అందుకోవడంతో భారత ఇన్నింగ్స్ 571 పరుగుల వద్ద ముగిసింది.