టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli Test Century) ఎట్టకేలకు మరో టెస్టు శతకం నమోదు చేశాడు. అయితే రన్ మేషిన్ కోహ్లీకి టెస్టుల్లో దాదాపు 1200 రోజుల తరువాత చేసిన సెంచరీ కావడంతో ఇది చాలా ప్రత్యేకం. ఇటీవల వన్డేలు, టీ20ల్లో శతకాలు బాది కమ్ బ్యాక్ చేసిన కోహ్లీ తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అరుదైన శతకం బాదాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 28వ శతకం కాగా, ఓవరాల్ గా విరాట్ ఇంటర్నేషనల్ కెరీర్ లో 75వ సెంచరీ మార్క్ చేరుకున్నాడు.


భారత్ కు కీలకమైన మ్యాచ్ కావడంతో నిలకడగా ఆడిన కోహ్లీ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ తడబాటు లేకుండా క్రీజులో నిలిచి, 241 బంతుల్లో దాదాపు మూడున్నరేళ్ల తరువాత టెస్టు శతకం నమోదు చేశాడు కోహ్లీ. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో టెస్ట్ ఫార్మాట్ లోనూ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. శతకాల మీద శతకాలు నమోదు చేసే కోహ్లీకి ఈ  టెస్ట్ శతకం చేయడానికి 41 టెస్టు ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. తాజా శతకం కోహ్లీ కెరీర్ లో రెండో నెమ్మదైన టెస్ట్ శతకం. గతంలో ఇంగ్లాండ్ జట్టుపై 289 బంతుల్లో చేసిన సెంచరీనే స్లో సెంచరీ. కాగా, ఆ తరువాత నేడు నాలుగో టెస్టులో ఆసీస్ తో మ్యాచ్ లో చేసిన శతకానికి సైతం కోహ్లీ అధిక బంతులను ఎదుర్కొన్నాడు. కోహ్లీ చివరగా 2019 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ చేశాడు. తాజా శతకానికి మూడున్నరేళ్లు పైగా వేచి చూశాడు.






కోహ్లీ తాజా సెంచరీ విశేషాలివే..
- ఆసీస్‌పై స్వదేశంలో దాదాపు పదేళ్ల తర్వాత కోహ్లీ శతకం బాదాడు. చివరగా 2013లో చెపాక్‌ వేదికగా ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు.
- విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఇది 28వ సెంచరీ. వన్డే, టీ20, టెస్టుల్లో కలిపి ఓవరాల్ గా ఇంటర్నేషనల్ కెరీర్ లో75వ శతకం. సచిన్ 100 శతకాల తరువాత రెండో స్థానంలో ఉన్న ఆటగాడు కోహ్లీనే. మరో 25 శతకాలు నమోదు చేస్తే ఆల్ టైమ్ గ్రేట్ సచిన్ సరసన కోహ్లీ నిలుస్తాడు.
- ఈ టెస్టు శతకం కోసం కోహ్లీ 1200 రోజులకు పైగా నిరీక్షించాడు. చివరగా 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై శతకం చేయగా.. 41 టెస్టు ఇన్నింగ్స్ ల తరువాత నేడు టెస్టు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు.
- ప్రత్యర్థి ఆసీస్ జట్టుపై 2018 తరువాత కోహ్లీ శతకం బాదడం ఇది తొలిసారి. 2018-19 సీజన్ లో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని భారత్ సాధించడంలో మాజీ కెప్టెన్ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు.


ఓవర్‌నైట్‌ స్కోరు 289/3తో నాలుగో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. 59 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత చూడచక్కని షాట్లతో చెలరేగుతున్నాడు. 16 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (28; 84 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. అయితే జట్టు స్కోరు 309 వద్ద అతడిని టార్‌ మర్ఫీ ఔట్‌ చేసింది. ఉస్మాన్‌ ఖవాజా క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్‌ ఆచితూచి ఆడాడు. చక్కగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ కోహ్లీకి బ్యాటింగ్‌ ఇస్తున్నాడు. దాంతో 128.2 ఓవర్లలో టీమ్‌ఇండియా 350 పరుగుల మైలురాయికి చేరుకుంది. 362/4 స్కోర్‌తో లంచ్‌కు వెళ్లింది. ఆపై టీ బ్రేక్ సమయానికి భారత్ 158 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 472 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (38 నాటౌట్), కోహ్లీ 138 క్రీజులో ఉన్నారు.