IND vs AUS, 4th Test:


అహ్మదాబాద్‌ టెస్టులో టీమ్‌ఇండియా మెరుగ్గా బ్యాటింగ్‌ చేస్తోంది. నాలుగో రోజు భోజన విరామానికి 4 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. కింగ్‌ విరాట్‌ కోహ్లీ (88; 220 బంతుల్లో 5x4) సెంచరీ వైపు సాగుతున్నాడు. ఆంధ్రా కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ (25; 70 బంతుల్లో 1x4, 1x6) అతడికి సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 144 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్‌ ఇంకా 118 పరుగుల లోటుతో ఉంది.






ఓవర్‌నైట్‌ స్కోరు 289/3తో నాలుగో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. 59 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బరిలోకి దిగిన విరాట్‌ కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత చూడచక్కని షాట్లతో చెలరేగుతున్నాడు. 16 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (28; 84 బంతుల్లో 2x4, 1x6) అతడికి అండగా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నాడు. అయితే జట్టు స్కోరు 309 వద్ద అతడిని టార్‌ మర్ఫీ ఔట్‌ చేసింది. ఉస్మాన్‌ ఖవాజా క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్‌ ఆచితూచి ఆడాడు. చక్కగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ కోహ్లీకి బ్యాటింగ్‌ ఇస్తున్నాడు. దాంతో 128.2 ఓవర్లలో టీమ్‌ఇండియా 350 పరుగుల మైలురాయికి చేరుకుంది. 362/4 స్కోర్‌తో లంచ్‌కు వెళ్లింది.


నిన్న ఏం జరిగిందంటే?


మూడో రోజు ఆట ముగిసే సమయానికి 99 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.  టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్  (235 బంతుల్లో  128, 12 ఫోర్లు, 1 సిక్సర్)  సెంచరీతో కదం తొక్కగా  సుమారు 13 నెలల తర్వాత విరాట్ కోహ్లీ (128 బంతుల్లో 59 నాటౌట్, 5ఫోర్లు)  టెస్టులలో అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం  కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా  (54 బంతుల్లో 16 నాటౌట్, 1 సిక్స్) లు క్రీజులో ఉన్నారు.


డ్రా దిశగా.. 


అహ్మదాబాద్ టెస్టు మొదలై మూడు రోజులు ముగిసింది. ఇప్పటికీ రెండు జట్లు తొలి ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేకపోయాయి.   మూడో రోజు పొద్దంతా బౌలింగ్ చేసిన  ఆసీస్ బౌలర్లు మూడు వికెట్లు మాత్రమే తీశారు.  నాలుగో రోజు కూడా  పిచ్ బ్యాటర్లకే అనుకూలంగా ఉండొచ్చు. అదే జరిగితే  భారత్ కు ఇంకా  బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. విరాట్,  జడ్డూ క్రీజులో ఉండగా  తర్వాత శ్రేయాస్ అయ్యర్, భరత్, అక్షర్ పటేల్, అశ్విన్ లు  కూడా తలో చేయి వేయగలిగితే  ఆదివారం మొత్తం   టీమిండియా బ్యాటింగ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   ఈ నేపథ్యంలో ఏదైనా అద్భుతం  జరిగితే తప్ప ఈ టెస్టులో ఫలితం తేలేది అనుమానమే...!