IND vs AUS, 3rd Test:


ఇండోర్ టెస్టులో పైచేయి ఎవరిది? అంటే ఏమో చెప్పలేని పరిస్థితి! గంట గంటకు వికెట్‌ కఠినంగా మారుతోంది. బ్యాటింగ్‌ చేసేందుకు కష్టమవుతోంది. స్పిన్నర్ల బౌలింగ్‌లో టర్నవుతున్న బంతి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. బ్యాటర్లు కనీసం డిఫెండ్‌ చేయలేకపోతున్నారు. ఇలాంటి కండీషన్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 60.3 ఓవర్లకు 163కు ఆలౌటైంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు 76 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా (59; 142 బంతుల్లో 5x4, 1x6) ఎప్పట్లాగే ఒంటరి పోరాటం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (26; 27 బంతుల్లో 3x4, 2x6) కీలక భాగస్వామ్యంలో పాలు పంచుకొన్నాడు. నేథన్‌ లైయన్‌ (8/64) రెచ్చిపోయాడు.


పుజారా లేకుంటే!


ఆసీస్‌ ఆలౌటైయ్యాక రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 15 వద్దే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ (5; 15 బంతుల్లో) ఔటయ్యాడు.  4.6వ బంతికి నేథన్ లైయన్‌ అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. సాలిడ్‌గా కనిపించిన రోహిత్‌ శర్మ (12; 33 బంతుల్లో)నూ అతడే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ (13; 26 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. కాగా జట్టు స్కోరు 54 వద్ద కింగ్‌ను కునెమన్‌ ఎల్బీగా పెవిలియన్‌ పంపించాడు. చాలాసేపు డిఫెన్స్‌ ఆడిన రవీంద్ర జడేజా (7; 36 బంతుల్లో)ను లైయన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. 79/4తో భారత్‌ తేనీటి విరామం తీసుకుంది.


శాసించిన లైయన్‌!


కఠిన పరిస్థితుల్లో శ్రేయస్‌, పుజారా ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 35 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యం అందించారు. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. పిచ్‌ నిర్జీవంగా మారుతుండటంతో వేగంగా ఆడారు. జట్టు స్కోరు 113 వద్ద అయ్యర్‌ను మిచెల్‌ స్టార్క్‌ ఔట్‌ చేశాడు. శ్రీకర్ భరత్‌ (3) కాసేపే ఉన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (16; 28 బంతుల్లో 2x4)  అండతో పుజారా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ క్రమంలో యాష్‌ను లైయన్‌ ఎల్బీ చేశాడు. 155 వద్ద నయావాల్‌ను లైయన్‌ ఔట్‌ చేశాడు. లెగ్‌సైడ్‌ వెళ్లిన బంతిని స్టీవ్‌స్మిత్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఉమేశ్‌ (0) భారీ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ (15 నాటౌట్‌; 39 బంతుల్లో 1x6) సింగిల్స్ నిరాకరిస్తూ పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే లైయన్‌ వేసిన 60.3వ బంతిని ముందుకొచ్చిన ఆడబోయిన సిరాజ్‌ (0; 7 బంతుల్లో) క్లీన్‌బౌల్డ్‌ అవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసింది.


యాష్‌, ఉమేశ్‌ వీరంగం


రెండో రోజు, గురువారం ఉదయం తొలిసెషన్లో టీమ్‌ఇండియా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్‌తో రవిచంద్రన్‌ అశ్విన్‌, రివర్స్‌ స్వింగ్‌తో ఉమేశ్‌ యాదవ్‌ కేవలం అరగంటలో 6 వికెట్లు పడగొట్టారు. 186/4తో గురువారం ఆట ఆరంభించిన ఆసీస్‌ను 76.3 ఓవర్లకు 197 స్కోరుకు ఆలౌట్‌ చేశారు. 88 పరుగుల ఆధిక్యానికి పరిమితం చేశారు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట మొదలు పెట్టిన పీటర్‌ హ్యాండ్స్‌ కాంబ్‌ (19), కామెరాన్‌ గ్రీన్‌ (21) ఎక్కువ బంతులే ఆడినా స్కోర్‌ చేయలేకపోయారు. జట్టు స్కోరు 186 వద్ద హాండ్స్‌కాంబ్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. టాసప్‌ అయిన బంతిని కాంబ్‌ ముందుకొచ్చి ఆడాడు. బ్యాటుకు తగిలిన బంతిని షార్ట్‌లెగ్‌లోని శ్రేయస్‌ అయ్యర్‌ చక్కగా ఒడిసిపట్టాడు. కీలక ఆటగాడు ఔటవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. మరో రెండు పరుగులకే కామెరాన్‌ గ్రీన్‌ను ఉమేశ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత అలెక్స్‌ కేరీ (3), మిచెల్‌ స్టార్క్‌ (1), నేథన్‌ లైయన్‌ (4), టార్‌ మర్ఫీ (0) ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు.