Meg Lanning:
మహిళల ప్రీమియర్ లీగు అరంగేట్రం సీజన్లో దిల్లీ క్యాపిటల్స్‌ను మెగ్ లానింగ్ నడిపించనుంది. ఆస్ట్రేలియాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్న ఆమెకే డీసీ పట్టం కట్టింది. యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఆమెకు డిప్యూటీగా ఎంపిక చేసింది.
అంతర్జాతీయ మహిళల క్రికెట్లో మెగ్ లానింగ్‌కు (Meg Lanning) తిరుగులేదు. ఆమె సారథ్యంలోనే ఆస్ట్రేలియా నాలుగు టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్లో గెలిచి తన జట్టుకు ఆరో ప్రపంచకప్‌ను అందించింది. గురువారం ఆమె ముంబయికి చేరుకొని దిల్లీ శిబిరంతో (Delhi Capitals) కలిసింది. ఇప్పటి వరకు 132 టీ20లు ఆడిన లానింగ్ 36.61 సగటు, 116.7 స్ట్రైక్‌రేట్‌తో 3405 పరుగులు చేసింది. 15 హాఫ్ సెంచరీలు బాదేసింది. ఆస్ట్రేలియాకు 100 టీ20ల్లో సారథ్యం వహించింది.
'నేనిది గర్వపడే సందర్భం. మొదట దిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. ఇప్పుడు జట్టును నడిపించబోతున్నాను. ఆటను ఆస్వాదిస్తూ అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకురావడమే ముఖ్యం' అని మెగ్ లానింగ్ తెలిపింది. 'క్రీడారంగంలో డబ్ల్యూపీఎల్ ఓ గొప్ప ముందడుగు. ఇదెంతో తెలివైన చర్య. భారత ప్రజల మనసుల్లో క్రికెట్ జీవిస్తోంది. మహిళల ప్రీమియర్ లీగును వారు కచ్చితంగా ఆదరిస్తారు. ఇలాంటి లీగులో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తోంది. రానున్న సంవత్సరాల్లో ఈ లీగు మరింత ఎదుగుతుంది' అని ఆమె వెల్లడించింది.
దిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచులో పటిష్ఠమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది. మార్చి 5న బ్రబౌర్న్ స్టేడియంలో తలపడనుంది. మహిళల ప్రీమియర్ లీగులో ఐదింట్లో మూడు జట్లను ఆసీస్ క్రికెటర్లే నడిపిస్తుండటం గమనార్హం. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ, యూపీ వారియర్స్‌కు అలీసా హేలీ సారథ్యం వహిస్తున్నారు. ఆర్సీబీకి స్మృతి మంధాన, ముంబయి ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లు.