IND vs AUS 3rd ODI: 


రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ఆస్ట్రేలియాకు దీటుగా బదులిస్తోంది. ప్రత్యర్థి నిర్దేశించిన 353 పరుగుల లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడటం లేదు. ఒత్తిడేమీ లేకుండానే విజయం సాధించే దిశగా పయనిస్తోంది. 26 ఓవర్లు ముగిసే 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (81; 57 బంతుల్లో 5x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. శుభారంభం అందించాడు. అతడికి తోడుగా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (54*; 57 బంతుల్లో 5x4, 1x6) హాఫ్ సెంచరీ సాధించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (13*) అతడికి తోడుగా ఉన్నాడు. భారత విజయానికి 24 ఓవర్లలో 185 పరుగులు అవసరం.


భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు మెరుపు ఆరంభం లభించింది. రోహిత్‌ శర్మకు తోడుగా ఈసారి వాషింగ్టన్‌ సుందర్‌ (18; 30 బంతుల్లో 1x4, 1x6) ఓపెనర్‌గా వచ్చాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 65 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం అందించాడు. సుందర్‌ తడబడ్డప్పటికీ హిట్‌మాత్రం చెలరేగాడు. ఆసీస్‌ పేసర్లు టార్గెట్‌ చేసిన మరీ సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టాడు. దాంతో 10 ఓవర్లకు భారత్‌ వికెట్లేమీ నష్టపోకుండానే 72 పరుగులు చేసింది. 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌ ఆ తర్వాత మరింత చెలరేగాడు. వేగంగా సెంచరీ వైపుకు సాగాడు. అయితే జట్టు స్కోరు 144 వద్ద అతడిని మాక్సీ కాట్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. అంతకు ముందే సుందర్‌ను అతడు ఔట్‌ చేశాడు.


వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లీ సైతం అద్భుతంగా ఆడాడు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక వేగం పెంచాడు. ఐదు సొగసైన బౌండరీలు బాదాడు. 56 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 61 బంతుల్లో 70 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 35 బంతుల్లో 27 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు.


అంతకు ముందు ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఈ స్టేడియంలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. టీమ్‌ఇండియా బౌలింగ్‌ను సింపుల్‌గా ఊచకోత కోసింది. ఆతిథ్య జట్టుకు 353 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది. చరిత్రలో నాలుగో సారి కంగారూ టాప్‌ ఆర్డర్లో నలుగురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు బాదేశారు. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (96; 84 బంతుల్లో 13x4, 3x6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ (74; 61 బంతుల్లో 8x4, 1x6), మార్నస్‌ లబుషేన్‌ (72; 58 బంతుల్లో 9x4, 0x6) సమయోచిత ఇన్నింగ్సులు ఆడారు. డేవిడ్‌ వార్నర్‌ (56; 34 బంతుల్లో 6x4, 4x6) ఆరంభంలోనే చితక్కొట్టాడు.


భారత జట్టు: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్‌, డేవిడ్ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ కేరీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, తన్వీర్‌ సంఘా, జోష్ హేజిల్‌వుడ్‌


పిచ్‌ రిపోర్టు: మైదానం పచ్చికతో మెరుస్తోంది. స్క్వేర్‌ బౌండరీలు 66 మీ, 67 మీటర్లు ఉన్నాయి. స్ట్రెయిట్‌గా బౌండరీ కొట్టాలంటే 79 మీటర్లు వెళ్లాలి. పిచ్‌పై పచ్చిక ఉంది. ముందు మ్యాచులతో పోలిస్తే వికెట్‌ కఠినంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 311. బంతి స్పిన్‌ అవ్వడం కన్నా జారిపోవడమే ఎక్కువగా ఉండొచ్చని సంజయ్‌ మంజ్రేకర్‌, బ్రాడ్‌ హడిన్‌ అన్నారు.