IND vs AUS 3rd ODI: 


టీమ్‌ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా దంచికొడుతోంది! తొలి ఓవర్‌ నుంచే భారత బౌలింగ్‌ను ఊచకోత కోస్తోంది. పేస్‌ బౌలర్ల బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటోంది. 25 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (78; 72 బంతుల్లో 11x4, 2x6) సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. సీనియర్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (52; 44 బంతుల్లో 5x4, 1x6) అతడికి తోడుగా ఉన్నాడు. అంతకు ముందు డేవిడ్‌ వార్నర్‌ (56; 34 బంతుల్లో 6x4, 4x6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు.


ప్లాట్‌ పిచ్‌.. బ్యాటు మీదకు చక్కగా వస్తోన్న బంతి! ఫాస్ట్‌ ఇంకేముంది పరిస్థితులను ఆస్ట్రేలియా అనుకూలంగా మలుచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగి టీమ్‌ఇండియాకు చుక్కలు చూపిస్తోంది. బంతి జారుతుండటంతో ఫాస్ట్‌ బౌలర్లు ఏమీ చేయలేకపోతున్నారు. దీనిని గమనించిన కంగారూ ఓపెనర్లు ఆది నుంచీ దంచికొట్టుడే పనిగా పెట్టుకున్నారు. డేవిడ్‌ వార్నర్‌ ఏకంగా 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదేశాడు. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగులో సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించాడు. అతడికి తోడుగా మార్ష్‌ సైతం సూపర్‌ షాట్లు కొట్టేశాడు. దాంతో ఆసీస్‌ 10 ఓవర్లకే 90 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 78 వద్ద వార్నర్‌ను ప్రసిద్ధ్‌ కృష్ణ ఔట్‌ చేయడం కాస్త ఊరట.


డేవిడ్‌ భాయ్‌ ఔటయ్యాక స్కోరు తగ్గుతుందనుకుంటే పొరపాటే అయింది. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్‌స్మిత్‌తో కలిసి మిచెల్‌ మార్ష్‌ మరింత ప్రమాదకరంగా మారాడు. వీరిద్దరూ పేసర్లను ఓ ఆటాడుకున్నారు. స్పిన్నర్లనూ సమర్థంగా ఎదుర్కొన్నారు. 45 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న మార్ష్‌ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. బుమ్రా బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వడివడిగా సెంచరీకి చేరువ అవుతున్నాడు. మరోవైపు 43 బంతుల్లోనే అర్ధశతకం బాదేసిన స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ పడకుండా చూస్తున్నాడు. వీరిద్దరి దెబ్బకు 21.1 ఓవర్లకే ఆసీస్‌ 150కి చేరుకుంది. వీరి భాగస్వామ్యమూ పెరుగుతోంది. వీరిని విడదీసేందుకు జడ్డూ, కుల్‌దీప్‌, సుందర్‌ చేసిన ప్రయత్నాలు సఫలమవ్వడం లేదు.


భారత జట్టు: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్‌, డేవిడ్ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, అలెక్స్‌ కేరీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, తన్వీర్‌ సంఘా, జోష్ హేజిల్‌వుడ్‌


పిచ్‌ రిపోర్టు: మైదానం పచ్చికతో మెరుస్తోంది. స్క్వేర్‌ బౌండరీలు 66 మీ, 67 మీటర్లు ఉన్నాయి. స్ట్రెయిట్‌గా బౌండరీ కొట్టాలంటే 79 మీటర్లు వెళ్లాలి. పిచ్‌పై పచ్చిక ఉంది. ముందు మ్యాచులతో పోలిస్తే వికెట్‌ కఠినంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 311. బంతి స్పిన్‌ అవ్వడం కన్నా జారిపోవడమే ఎక్కువగా ఉండొచ్చని సంజయ్‌ మంజ్రేకర్‌, బ్రాడ్‌ హడిన్‌ అన్నారు.


రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌: రాజ్‌కోట్‌లో వాతావరణం, పరిస్థితులు బాగుంటాయి. ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా లేదు. ఈ ఒక్క గేమ్‌ గురించే ఆలోచిస్తున్నాం. శారీరకంగా పోలిస్తే మానసికంగా పునరుత్తేజం పొందేందుకు విరామాలు చాలా అవసరం. మేం ఆడుతున్న విధానానికి ఆనందంగా ఉన్నాం. అన్ని విభాగాల్లో రాణిస్తున్నాం. మేం ఇంకేం చేయడానికైనా అవకాశాలు ఉన్నాయి. పిచ్‌ కాస్త మందకొడిగా ఉంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఇంకా బాగుంటుంది. ఎలాగైనా మేం ఛేదనకే దిగాలనుకున్నాం. మేం రెండు కొత్త బంతులు తీసుకుంటామేమో చూడాలి. నేను, విరాట్‌, కుల్‌దీప్‌ తిరిగొచ్చాం. అశ్విన్‌ ఆడటం లేదు. వాషింగ్టన్‌ వచ్చాడు. ఇషాన్‌కు ఒంట్లో బాగాలేదు. వైరల్‌ ఫీవర్‌ వచ్చింది.