IND Vs AUS, 3rd ODI: వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు ఇదివరకే సిరీస్ ఓటమి రుచి చూపించిన టీమిండియా.. వైట్ వాష్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇదివరకే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. రాజ్‌కోట్ వేదికగా నేడు (బుధవారం) జరుగబోయే మూడో వన్డేలో తలపడబోతోంది. మరికొద్దిరోజుల్లో స్వదేశంలోనే మొదలుకాబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు రోహిత్ సేనకు ఇదే చివరి వన్డే. మెగా టోర్నీలో భారత వరల్డ్ కప్ వేట కూడా మొదలయ్యేది ఆస్ట్రేలియాతోనే కావున ఆ మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో అడుగేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. మరోవైపు ఆసీస్ ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించి పరువు కాపాడుకోవాలని భావిస్తున్నది. వన్డేలలో ఆస్ట్రేలియాను భారత్ ఇంతవరకూ వైట్ వాష్ చేయలేదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గెలిస్తే అది కొత్తచరిత్రే కానుంది.
ఆల్ సెట్.. వాళ్లకు ప్రాక్టీస్
ఆసియా కప్‌కు ముందు భారత వన్డే వరల్డ్ కప్ జట్టుపై ఎన్నో అనుమానాలు. అప్పుడే శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రాలు సుదీర్ఘకాలం విరామం తర్వాత వన్డే జట్టులోకి రావడం, ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించారో లేదో క్లారిటీ లేకపోవడం.. నెంబర్ 4 ఎవరిది..? సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాలు, లోయరార్డర్ కష్టాలు.. వంటివి భారత్‌ను వేధించాయి. కానీ ఆసియా కప్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతికిన భారత్‌కు ఆస్ట్రేలియా సిరీస్‌లో దాదాపు అన్ని బాక్సులను టిక్ చేసింది. ఈ సిరీస్ ద్వారా భారత్‌కు కలిగిన లాభం ఏదైనా ఉందా..? అంటే అది కచ్చితంగా శ్రేయస్, సూర్య ఫామ్‌లోకి రావడమే. ఆసియాకప్‌లోనే తన పునరాగమనాన్ని ఘనంగా చాటిచెప్పిన రాహుల్.. ఈ సిరీస్‌లో దానిని కొనసాగిస్తూనే కెప్టెన్‌గా కూడా సక్సెస్ అయ్యాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తనమీద ఎంత ధీమా అయినా పెట్టుకోవచ్చు అని భరోసానిచ్చాడు. ఇషాన్ కూడా టచ్‌లోనే ఉన్నాడు.
వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్నవారిలో దాదాపు అందరికీ మంచి ప్రాక్టీస్ లభించింది. ఇక రాజ్‌కోట్‌లో భారత్ ప్రధానంగా దృష్టి సారించేది కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల మీదే. ఈ ఇద్దరూ రెండు వన్డేలకు రెస్ట్ తీసుకున్నారు. మూడో వన్డేలో మాత్రం ఈ ఇద్దరితో పాటు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ కూడా జట్టుతో చేరాడు. ప్రపంచకప్‌కు ముందు వీరికి ఇది మంచి ప్రాక్టీస్ కానుంది. సీనియర్ల రాకతో గిల్, శార్దూల్, షమీలకు విశ్రాంతి దక్కగా రుతురాజ్ గైక్వాడ్ ఆసియా క్రీడల నిమిత్తం చైనాకు వెళ్లాడు. ఓపెనర్లుగా రోహిత్ తో కలిసి ఇషాన్ కిషన్ బరిలోకి దిగొచ్చు. మూడో స్థానంలో కోహ్లీ వస్తే అయ్యర్ 4వ స్థానంలో రాహుల్ ఐదులో రావొచ్చు. హార్ధిక్ పాండ్యాకూ ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో సూర్యను ఫినిషర్‌గా వాడొచ్చు. మహ్మద్ సిరాజ్, బుమ్రాలు పేస్ బాధ్యతలు మోయనున్నారు.
ఆసీస్ పుంజుకునేనా..?
ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో వైట్ వాష్ తప్పించుకోవడానికి ఆసీస్ బరిలోకి దిగనుంది. రెండో వన్డేకు దూరమైన పాట్ కమిన్స్ తిరిగి జట్టుతో చేరతాడు. కమిన్స్‌తో పాటు తొలి రెండు వన్డేలకు దూరమైన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, స్పిన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇవాళ బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా గడిచిన ఐదు వన్డేలలో ఓడింది. వరల్డ్ కప్‌కు ముందు ఇది ఆ జట్టుకు ఇబ్బందికరపరిస్థితే. అదీగాక గత ఐదు మ్యాచ్‌లకు గాను నాలుగింటిలో ఆ జట్టు బౌలర్లు ప్రత్యర్థులకు 300 ప్లస్ (338, 416, 315, 399) పరుగులు సమర్పించుకున్నారు. డెత్ ఓవర్లలో ఆసీస్ పేసర్లు దారుణంగా తడబడుతున్నారు. స్టార్క్ రాకతో దానికి అడ్డుకట్ట వేయాలని ఆసీస్ భావిస్తోంది. బ్యాటింగ్‌లో కూడా వార్నర్ మినహా టాపార్డర్‌లో మిచెల్ మార్ష్, లబూషేన్, స్మిత్, స్టోయినిస్, గ్రీన్‌లు దారుణంగా విఫలమవుతున్నారు. మరి నేటి మ్యాచ్‌లో అయినా వీళ్లు గాడినపడాలని ఆసీస్ టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హెజిల్‌వుడ్
మ్యాచ్ వివరాలు :
- సౌరాష్ట్రలోని రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరుగబోయే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి మొదలుకానుంది.
లైవ్:
- ఈ వన్డే సిరీస్ ప్రత్యక్ష ప్రసారాలను టెలివిజన్‌లో అయితే స్పోర్ట్స్ 18లో.. యాప్, వెబ్‌సైట్స్‌లో అయితే జియో సినిమా యాప్‌లో ఉచితంగానే చూడొచ్చు.