ODI World Cup 2023: ఆసియా కప్‌ - 20‌23లో సూపర్ -4లోనే నిష్క్రమించి కీలక ఆటగాళ్లు గాయాలపాలైన  రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో బరిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఉన్న  బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయి. తాజా, మాజీ సారథులు షకిబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.  తాను వన్డే వరల్డ్ కప్‌లో  ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని తమీమ్  బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు  చెప్పగా ఆ ప్రతిపాదనకు అంగీకరించేదిలేదని అలా చేస్తే తాను రాజీనామా చేస్తానని షకిబ్ అల్ హసన్ బెదిరింపులకు దిగుతున్నాడు. 


ఏమైంది..? 


కొన్నినెలల క్రితమే తమీమ్ ఇక్బాల్ వన్డేలతో పాటు ఇతర ఫార్మాట్లకూ గుడ్ బై చెప్పాడు.  కానీ వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని  సాక్షాత్తూ ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకుని  తమీమ్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని  అతడిని కోరింది. అయితే రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న తమీమ్.. వెన్ను గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక వచ్చే నెల నుంచి మొదలుకాబోయే వన్డే వరల్డ్ కప్‌లో  కూడా తమీమ్ కీలకం కానున్నాడని అనుకుంటున్న తరుణంలో అతడు మాత్రం.. తాను  ప్రపంచకప్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడలేనని  ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని   చెప్పాడట.  తనను ఇంకా వెన్నుగాయం  వేధిస్తుందని  కూడా   బీసీబీకి తెలిపినట్టు బంగ్లా టీవీ ఛానెల్ కథనాలు వెల్లడిస్తున్నాయి. 






హాఫ్ ఫిట్ ప్లేయర్లు వద్దు


తమీమ్ నిర్ణయంపై షకిబ్  అభ్యంతరం వ్యక్తం చేశాడని సమాచారం. తనకు హాఫ్ ఫిట్ ప్లేయర్లు వద్దని ఆడితే మొత్తం ప్రపంచకప్ అయ్యేదాకా అందుబాటులో ఉండాలని లేకుంటే మొత్తానికి తప్పుకోవాలని  బీసీబీ చీఫ్ నజ్ముల్ హసన్‌తో తేల్చి చెప్పాడట.  నిన్న రాత్రి నజ్ముల్‌ను కలిసిన షకిబ్, బంగ్లా హెడ్‌కోచ్  చండిక హతురసింఘాలు  సమావేశమవ్వగా అప్పుడే బంగ్లా సారథి తన నిర్ణయాన్ని కరాఖండీగా చెప్పేశాడట. ఒకవేళ  తమీమ్‌ను గనక సెలెక్ట్ చేస్తే తాను  సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని, వరల్డ్ కప్ కూడా ఆడబోనని హెచ్చరించినట్టు స్థానిక మీడియా కోడై కూస్తోంది.  






వన్డే వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ తప్ప ఇదివరకే అన్ని జట్లూ తమ 15 మంది సభ్యులను ప్రకటించాయి.   నేడో రేపో బంగ్లా కూడా జట్టును ప్రకటిస్తుందని వార్తలు వస్తుండగా ఈ ఊహించని ట్విస్ట్ బంగ్లా టైగర్స్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. మరి ఈ సమస్యకు బీసీబీ ఏం పరిష్కారం కనుక్కుంటుందో వేచి చూడాలి.