IND vs AUS 2nd Test Highlights: 


అరుణ్‌ జైట్లీ మైదానంలో టీమ్‌ఇండియా దుమ్మురేపింది! రెండో టెస్టు తొలి రోజే మ్యాచ్‌పై పట్టు సాధించింది. మొదటి సెషన్‌ నుంచే ప్రత్యర్థిని కంగారు పెట్టేసింది. ఒకవైపు స్పిన్‌తో అశ్విన్‌ (3/57), జడేజా (3/57) ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు. మరోవైపు పదునైన పేస్‌తో మహ్మద్‌ షమీ (4/60) కంగారూల భరతం పట్టాడు. దాంతో తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌ 78.4 ఓవర్లకు 263కే ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (81; 125 బంతుల్లో 12x4, 1x6), పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (72 నాటౌట్‌; 142 బంతుల్లో 9x4) రాణించారు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన హిట్‌మ్యాన్‌ సేన ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (13 బ్యాటింగ్‌; 34 బంతుల్లో 1x4), కేఎల్‌ రాహుల్‌ (4 బ్యాటింగ్‌; 20 బంతుల్లో) నిలకడగా ఆడారు. భారత్‌ 242 పరుగుల లోటుతో ఉంది.


తొలి సెషన్లో 3 వికెట్లు


తొలి మ్యాచులోనే మొదట బ్యాటింగ్‌ ఎంచుకొని విలవిల్లాడిన అనుభవం ఆసీస్‌ది. దిల్లీ టెస్టులోనూ ఇదే పొరపాటు చేసింది!  ఆచితూచి ఆడటంతో తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్‌ వార్నర్‌ (15) నిలకడగా ఆడారు. 15.2వ బంతికి వార్నర్‌ను ఔట్‌ చేయడం ద్వారా మహ్మద్ షమి వికెట్ల వేట మొదలెట్టాడు. రౌండ్‌ ది వికెట్ వచ్చిన వేసిన ఈ బంతి బ్యాటర్‌ బ్యాటు అంచుకు తగిలి నేరుగా కీపర్‌ శ్రీకర్ భరత్‌ చేతుల్లో పడింది. ఈ క్రమంలో మార్నస్‌ లబుషేన్‌ (18) ఖవాజాకు అండగా నిలిచాడు. 22.4వ బంతికి అశ్విన్‌ అతడిని ఎల్బీగా ఔట్‌ చేశాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి స్టీవ్‌ స్మిత్‌ (0) డకౌట్‌ అయ్యాడు.


ఆకట్టుకున్న ఖవాజా, హాండ్స్‌కాంబ్‌


ఒకవైపు మిగతా బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నా ఉస్మాన్‌ ఖవాజా మాత్రం అదరగొట్టాడు. భారత స్పిన్నర్లను తెలివిగా ఎదుర్కొన్నాడు. 71 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. వడివడిగా శతకం వైపు సాగిన అతడిని రవీంద్ర జడేజా కీలక సమయంలో పెవిలియన్‌ పంపించాడు. జట్టు స్కోరు 167 వద్ద అతడిచ్చిన క్యాచ్‌ను కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అంతకు ముందే హెడ్‌ (12)ను షమి ఔట్‌ చేశాడు. అలెక్స్‌ కేరీ (0) యాష్‌ బౌలింగ్‌లో డకౌట్‌ అయ్యాడు.


మిడిల్‌లో తిప్పేసిన యాష్, జడ్డూ


కష్టాల్లో పడ్డ జట్టును హ్యాండ్స్‌కాంబ్‌, ప్యాట్‌ కమిన్స్‌ (33; 59 బంతుల్లో 3x4, 2x6) ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 122 బంతుల్లో 59 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోరు 227 వద్ద కమిన్స్‌, టాడ్‌ మర్ఫీ (0) రవీంద్ర జడేజా ఔట్‌ చేశారు. ఆఖర్లో నేథన్‌ లైయన్‌ (10), మాథ్యూ కుహెన్‌మన్‌ (6)ను షమి పెవిలియన్‌ పంపించడంతో ఆసీస్‌ 78.4 ఓవర్లకు 263కు ఆలౌటైంది.