IND vs AUS 1st ODI:


భారత్‌, ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీసు నేడు ఆరంభమవుతోంది. మొహాలిలోని ఐఎస్‌ బింద్రా స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రోహిత్‌, కోహ్లీ సహా సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.


కేఎల్‌ రాహుల్‌, భారత  కెప్టెన్‌ : మేం మొదట బౌలింగ్‌ చేస్తాం. ఈ మైదానం ఛేదనకు అనుకూలంగా ఉంటుంది. అందుకే బౌలింగ్‌ చేస్తాం. మేం మరికొన్ని విభాగాల్లో ప్రయోగాలు చేయాల్సి ఉంది. మరింత మెరుగుయ్యేందుకు మేమిలా చేస్తూనే ఉంటాం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో మేమిప్పుడు తలపడుతున్నాం. ఆస్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలే. వారు గట్టి పోటీనిస్తారు. అందుకే వారిని ఎదుర్కోవడాన్ని మేం ఆస్వాదిస్తాం.


ప్యాట్‌ కమిన్స్‌, ఆస్ట్రేలియా కెప్టెన్‌: మళ్లీ పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. చాలాకాలంగా జట్టుకు దూరమయ్యాను. మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్ ఇంకా సిద్ధమవ్వలేదు. మేమూ మొదట బౌలింగ్‌ చేయాలనుకున్నాం. అయితే టాస్‌ ఓడినా ఫర్వాలేదు. వాతావరణం బాగుంది. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ ఓపెనింగ్‌ చేస్తారు. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, ఇంగ్లిస్‌ ఆ తర్వాత బ్యాటింగ్‌కు వస్తారు.


భారత జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి


ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, జోస్‌ ఇంగ్లిష్, మార్కస్‌ స్టాయినిస్‌, మాథ్యూ షార్ట్‌, ప్యాట్‌  కమిన్స్‌, సేన్‌ అబాట్‌, ఆడమ్‌ జంపా


పిచ్‌ రిపోర్ట్: మొహలి హై స్కోరింగ్‌ గ్రౌండ్‌. ఈ సారీ అలాగే ఉంటుంది. బౌండరీలు కొట్టడంతో పాటు బ్యాటర్లు పరుగులు తీయాలి. టాస్ గెలిచిన జట్టు ఛేదనకు మొగ్గు చూపుతుంది. బౌన్స్‌ బాగుంటుంది. మంచి లయ అందుకున్న  బ్యాటర్లు బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తారు.


వన్డే ప్రపంచకప్‌కు ముందే ఆసియా కప్‌లో ఎంట్రీ ఇచ్చిన  కెఎల్ రాహుల్, బుమ్రాలు  పూర్తిగా కోలుకుని మునపటి లయను అందుకోగా శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అక్టోబర్ నుంచి జరుగబోయే మెగా టోర్నీలో ఉండాలంటే అయ్యర్  ఈ సిరీస్‌లో రాణించడం  అత్యావశ్యకం. మొహాలీలో అతడు ఆడతాడనే టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది.  ఇక అక్షర్ పటేల్ కూడా గాయంతో  ఇబ్బందిపడుతున్న తరుణంలో అతడి ప్లేస్‌లో వచ్చిన  రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్‌‌ల మీద కూడా భారీ అంచనాలున్నాయి. వీళ్లు గనక మెరుగ్గారాణించి అక్షర్ కోలుకోకుంటే భారత వరల్డ్ కప్ జట్టులో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.  ఇక వన్డేలలో పేలవ ప్రదర్శనలతో విసిగిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు కూడా తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశం. ఈ సిరీస్‌లో సీనియర్లు గైర్హాజరీ నేనపథ్యంలో సూర్యకు తుది జట్టులో అవకాశం ఉంటుంది.  కానీ దానిని అతడు ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది ఆసక్తికరం. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ జట్టు సభ్యుడిగానే ఉన్నా ఫైనల్ లెవన్‌లో చోటిస్తారో లేదో చూడాలి.  ఇక బౌలింగ్ విషయంలో ముగ్గురు పేసర్లకు  ప్రపంచకప్ ముందు అసలైన పరీక్ష.  పటిష్టమైన ప్రత్యర్థిని భారత్ పేస్ త్రయం (బుమ్రా, సిరాజ్, షమీ)తో  ఏ మేరకు అడ్డుకట్ట వేయగలరనేది  చూడాలి.