India Won ODI series against New Zealand | అహ్మదాబాద్: టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత పురుషుల జట్టు ఓటమిపాలైతే.. ఇటు అమ్మాయిలు మాత్రం కివీస్ పై సత్తాచాటారు. న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ నెగ్గి భారత మహిళల జట్టు అదుర్స్ అనిపించింది. కివీస్ పై జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో భారత మహిళలు నెగ్గారు. కీలకమైన నిర్ణయాత్మక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ స్మృతీ మందాన (100: 122 బంతుల్లో 10 ఫోర్లు) అద్భుత శతకంతో చెలరేగి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (59 నాటౌట్: 63 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చింది.
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. భారత మహిళలు 4 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మరో 34 బంతులు మిగిలుండగానే భారత అమ్మాయిలు మూడో వన్డేలో గెలుపొంది, తద్వారా వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్నారు.
మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ లో కివీస్ కు మంచి ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాటర్లు సుజీ బేట్స్ (4), లారెన్ డౌన్ (1) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో.. ఓ దశలో 88 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కివీస్ మహిళలు కష్టాల్లో పడ్డారు. అయితే మిడిలార్డర్ బ్యాటర్ బ్రూక్ (86: 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకుంది. కివీస్ ఓపెనర్ జార్జియా ప్లిమర్ (39) రాణించగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఇసాబెల్లా గేజ్ (25), తహుహు (24 నాటౌట్) బ్రూక్ కు సహకారం అందించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా, ప్రియా మిశ్రాకు 2 వికెట్లు దక్కాయి. సైమా ఠాకూర్, రేణుకా చెరో వికెట్ తీశారు.
భారత ఇన్నింగ్స్ నడిపించిన మందాన, హర్మన్ ప్రీత్
భారత్ కు 4వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ 12 పరుగులు చేసి ఔటైంది. రోవే బౌలింగ్ లో కీపర్ గేజ్ కు క్యాచిచ్చి వెనుదిరిగింది. మరో ఓపెనర్ స్మృతీ మందాన, వన్ డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా సహకారంతో స్కోరు బోర్డును నడిపించింది. డివైన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ పట్టడంతో భాటియా (35) ఔటైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్, మందాన కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. శతకం చేసిన మందాన 100 పరుగుల వద్దే రోవే బౌలింగ్ లో బౌల్డ్ అయింది. అయితే అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ చేసి వెల్లింది.
మరో 24 పరుగులు అవసరమైన తరుణంలో మందాన ఔట్ కాగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. జెమిమా రోడ్రిగ్స్ 22 రన్స్ చేసి జోనస్ బౌలింగ్ లో ఎల్బీడబ్లూగా వికెట్ సమర్పించుకుంది. హర్మన్ ప్రీత్ విన్నింగ్ షాట్ ఫోర్ కొట్టి భారత్ ను విజయతీరానికి చేర్చింది. మూడో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత మహిళలు వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుని సత్తా చాటారు.