ICC Women's T20 Rankings:  మహిళల టీ20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో 87 పరుగులు చేసిన స్మృతి మంధాన విజయంలో కీలకపాత్ర పోషించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో తన మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. అలాగే భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 12వ స్థానానికి చేరుకుంది. భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ 20వ స్థానంలో ఉంది. 


బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రేణుకాసింగ్ ఐదో స్థానానికి చేరుకుంది. ఆమె కెరీర్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఇంగ్లండ్ పై రేణుక సంచలన ప్రదర్శన చేసింది. 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఐర్లాండ్ పై విజయంతో భారత్ సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. సెమీఫైనల్ లో భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది.


మంధాన మెరుపు ఇన్నింగ్స్


భారత జట్టు తరఫున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐర్లాండ్‌పై బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో ఆమె 56 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి తొమ్మిది ఫోర్లు, మూడు అద్భుతమైన సిక్సర్లు కొట్టింది. 


హర్మన్ ప్రీత్ అరుదైన ఘనత


భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు అందుకున్నారు. టీ20 ఫార్మాట్ లో ప్రపంచంలోనే 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రీడాకారిణిగా హర్మన్ ఘనత సాధించారు.  మహిళల టీ20 ప్రపంచకప్ లో నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ కౌర్ కు 150వ టీ20 మ్యాచ్. అలాగే పొట్టి ఫార్మాట్ లో 3వేల పరుగులు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచారు. సుజీ బేట్స్, మెగ్ లానింగ్, స్టెఫానీ టేలర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన మహిళా ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తింపు పొందారు. 


మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 5 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన 87 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ నిరాశపరిచింది. ఆమె 20 బంతులాడి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ హర్మన్ కు 150వ టీ20 మ్యాచ్.