ICC U19 Mens Cricket World Cup 2024 : అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup 2024)ను ఆరోసారి ఒడిసిపట్టాలన్న యువ భారత్‌ ఆటగాళ్ల కల చెదిరింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా.... అండర్‌ 19 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఓడించి కప్పును ఒడిసిపట్టింది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా... కంగారుల సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటై పరాజయం పాలైంది. అయితే అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ  అండర్ 19 వన్డే ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌‌ జట్టులో భారత ఆటగాళ్ల అధిపత్యం కనిపించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా కుర్రాళ్లకు అవకాశం దక్కింది.


నలుగురికి చోటు...
టీమిండియా నుంచి బ్యాటింగ్ విభాగంలో ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్‌కు చోటు దక్కగా బౌలింగ్ విభాగంలో సౌమీ పాండేకు చోటు దక్కింది. 56 సగటుతో 397 పరుగులు చేసిన ఉదయ్ సహారన్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతడిని ఐదో స్థానానికి ఎంపిక చేశారు. 60 సగటుతో 360 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ వన్ డౌన్ బ్యాటర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. 60 సగటుతో 303 పరుగులు చేసిన సచిన్ దాస్ ఆరో స్థానానికి ఎంపికయ్యాడు. అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన సౌమీ పాండే 18 వికెట్లతో చోటు దక్కించున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, సౌతాప్రికా జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. పాకిస్థాన్, వెస్టిండీస్ నుంచి ఒక్కో ఆటగాడికి చోటు దక్కింది. ఆస్ట్రేలియా ఆటగాడు హ్యూవీబ్‌జెన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్‌గా వెస్టిండీస్ ఆటగాడు నాథన్ ఎడ్వర్డ్‌ను ఎంపిక చేశారు. బౌలర్లుగా ఆస్ట్రేలియా ఆటగాడు కల్లమ్ విడ్లర్, పాకిస్థాన్ ఆటగాడు ఉబైద్ షా, సౌతాఫ్రికా ఆటగాడు క్వేనా మఫాకా చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ అండర్ 19 వన్డే ప్రపంచకప్ జట్టు:
లువాన్ డ్రే ప్రిటోరియస్, హ్యారీ డిక్సన్, ముషీర్ ఖాన్, హ్యూవీబ్‌జెన్(కెప్టెన్), ఉదయ్ సహారన్, సచిన్ దాస్, నాథన్ ఎడ్వర్డ్, కల్లమ్ విడ్లర్, ఉబైద్ షా, క్వేనా మఫాక్, సౌమీ పాండే


భారత ఓటమికి కారణలివే..
ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్‌ కెప్టెన్‌ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో కేవలం ఎనిమిది పరుగులకే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ రెండుసార్లు ఔట్ నుంచి తప్పించుకున్నా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు.


భారత్ బౌలర్ల ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ తరహాలో లేదు. అయితే, 16పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ దక్కినా.. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడును ఆశించిన స్థాయిలో భారత్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా పూర్తి ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 77 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే, ఆరంభంలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం జట్టుపై ప్రభావం చూపింది. భారత్ జట్టు మిడిల్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. మిడిలార్డర్‌ బ్యాటర్లు ఎవరు కూడా కనీసం 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు.