Crucial stepping stone for Devdutt Padikkal: దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న కర్ణాటక ప్లేయర్‌(Karnataka batter) దేవదత్‌ పడిక్కల్‌(Devdutt Padikka) టెస్టు జట్టులోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన కె.ఎల్‌. రాహుల్‌(KL Rahul) స్థానంలో పడిక్కల్‌ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్‌.. గోవాతో జరిగిన మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్‌ జోరు ఆగలేదు.


ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో పడిక్కల్‌ తన ఫామ్‌ను చాటాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఈ వరుస సెంచరీలతో పడిక్కల్‌కు టెస్ట్‌ జట్టులో చోటు దక్కింది. టెస్ట్‌ జట్టులో చోటు దక్కడంపై  పడిక్కల్‌ స్పందించాడు.


స్పందించిన పడిక్కల్‌
టెస్టుల్లో ఆడటం తన కల అని.. ఆ కల ఇప్పటికి నెరవేరిందని పడిక్కల్‌ తెలిపాడు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతూనే 2022-23 సీజన్‌ ఆడినట్లు గుర్తు చేసుకుని భావో‌ద్వేగానికి గురయ్యాడు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడినప్పుడు తరచూ అనారోగ్యం పాలవ్వడంతో దాదాపు 10 కిలోల బరువు తగ్గినట్లు కూడా చెప్పాడు. టెస్టు జట్టులోకి పిలుపు రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాని.. కెరీర్‌లోనే చాలా కఠినమైన కాలం గడిచాక ఈ అవకాశం వచ్చిందని పడిక్కల్‌ తెలిపాడు. తనశ్రమ ఫలించినందుకు సంతోషంగా ఉందన్నాడు. అనారోగ్యం నుంచి కోలుకొని.. ఫిట్‌నెస్‌ సాధించడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్‌ అని తెలిపాడు. 10 కిలోల బరువు తగ్గిన సమయంలో సరైన ఆహారం, కండరాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టా’నని పడిక్కల్‌ పేర్కొన్నాడు. బీసీసీఐ ప్రకటన
దేవదత్ పడిక్కల్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటుదక్కిందంటూ బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.


ఫిట్‌నెస్‌ సమస్యతో బాధపడుతున్న కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడని అతని పరిస్థితిని బోర్డు మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొంది. రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో కోలుకుంటున్నాడని అతడు తిరిగి నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉందని ఈ క్రమంలో మూడో టెస్టుకు రాహుల్‌ స్ధానంలో దేవదత్ పడిక్కల్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిందని  బీసీసీఐ పేర్కొంది. తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌ 2227 పరుగులు చేశాడు.


పడిక్కల్‌ ఇప్పటికే భారత జట్టు తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంతో జరిగిన టీ20 సిరీస్‌తో పడిక్కల్‌ డెబ్యూ చేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పడిక్కల్‌కు పిలుపువచ్చింది.  గతంలో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిధ్యంవహించి అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌పై అర్ధశతకం సాధించాడు. గతేడాది అంతర్జాతీయ జట్టులో టీ20 కెరీర్‌ను ప్రారంభించి రెండు మ్యాచ్‌లు ఆడాడు. వీటిల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.