India's longest-living Test cricketer DK Gaekwad passes away : భారతదేశంలో ఇప్పటి వరకు జీవించి ఉన్న వారిలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ (DK Gaekwad )95 ఏళ్ళవయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల వల్ల గత 12 రోజులుగా బరోడా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు.
ఈయన టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ తండ్రి. జూన్ 1952లో ఇంగ్లండ్ పై టీమిండియా తరఫున తొలి టెస్ట్ ఆడిన గైక్వాడ్ 9 ఏళ్ల పాటు 11 టెస్టులు ఆడాడు. 350 పరుగులు చేశాడు. వాటిలో నాలుగు టెస్టులకు కెప్టెన్ గా ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బరోడా తరఫున 17 ఏళ్ల పాటు ఆడాడు. 1947 నుంచి 1964 మధ్య 110 మ్యాచ్ లలో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలతో 5788 రన్స్ చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ తన చివరి టెస్టును 1961లో పాకిస్థాన్ పై ఆడారు.
2016లో 87 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ తర్వాత దేశంలో జీవించి ఉన్న ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ ట్యాగ్ ఈ దత్తాజీరావు గైక్వాడ్ పేరుకి మారింది. అయితే గత 12 రోజులుగా దత్తాజీరావు బరోడా హాస్పిటల్లోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. దత్తాజీరావు గైక్వాడ్ తనయుడు అన్షుమన్ గైక్వాడ్ కూడా ఇండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత టీమిండియా కోచ్ గానూ పని చేశాడు. దత్తాజీరావు గైక్వాడ్ మరణానికి ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది.