ICC Test Rankings:  ఐసీసీ పురుషుల టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. దాదాపు 4 సంవత్సరాల పాటు టెస్ట్ బౌలర్ల జాబితాలో నెంబర్ 1 గా నిలిచిన కమిన్స్.. ఇప్పుడు ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. 


ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీ పురుషుల టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్ లో నెంబర్ 1గా అవతరించాడు. గత వారం మౌంట్ మౌంగనుయి వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 267 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన అండర్సన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకున్నాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం అండర్సన్ కు ఇది ఆరోసారి. 


రవీంద్ర జడేజా @5


ఇక ఇప్పటివరకు టాప్ లో ఉన్న కమిన్స్ 858 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. అయితే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరగనున్న మిగిలిన 2 టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తే మరలా అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. అలాగే పునరాగమనంలో ఆసీస్ పై అదరగొట్టిన భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ బౌలర్ల జాబితాలో టాప్- 10 లో నిలిచాడు. 7 స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా ఆటగాడు అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. 






జడేజా అద్భుత ప్రదర్శన


మోకాలి గాయంతో దాదాపు 5 నెలలు ఆటకు దూరమైన రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు తిరిగి జట్టులోకి వచ్చాడు. పునరాగమనంలో ఆసీస్ పై అదరగొట్టే ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాట్ తో, బంతితో రాణిస్తున్నాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 10 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. బ్యాటింగ్ లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. జడేజా రాకతో జట్టులో సమతుల్యం వచ్చింది. మిగిలిన మ్యాచుల్లోనూ జడ్డు ఇలాగే రాణించాలని జట్టు కోరుకుంటోంది. 


'నా బౌలింగ్‌లో స్వీప్ చేయడం మంచిది కాదు'


ఢిల్లీలో రెండో టెస్ట్ ముగిసిన అనంతరం జడేజా తన బౌలింగ్ గురించి మాట్లాడాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారని తనకు తెలుసు అని జడేజా అన్నాడు. ఈ కారణంగా బ్యాట్స్‌మెన్ తప్పులు చేస్తే అవకాశాలు వస్తాయని తనకు తెలుసు కాబట్టి వికెట్ టు వికెట్‌లో స్ట్రెయిట్ లైన్‌లో బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు.  ‘నా బౌలింగ్‌కు వ్యతిరేకంగా, స్వీప్ షాట్ మంచి ఎంపిక అని నేను అనుకోను. ముఖ్యంగా అటువంటి వికెట్‌పై స్వీప్ ఉత్తమ షాట్ కాదు.’ అన్నాడు. ఢిల్లీ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై రవీంద్ర జడేజా 10 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఈ అద్భుత ప్రదర్శనతో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.