ENG vs NZ Match Highlights: మెగా టోర్నీలో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో ఇంగ్లండ్ సత్తాచాటింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ రేసులో నిలవటంతో పాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 


బట్లర్ మెరుపులు


టీ20 ప్రపంచకప్ లో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్ కు ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ( 40 బంతుల్లో 52) మొదటి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ముఖ్యంగా బట్లర్ 47 బంతుల్లోనే 73 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. అయితే ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని ఇంగ్లండ్ మిడిలార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మొయిన్ అలీ(5), బ్రూక్ (7), స్టోక్స్ (8) విఫలమయ్యారు. లివింగ్ స్టోన్ 20 పరుగులతో పర్వాలేదనిపించాడు. 


గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం


180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (16), కాన్వే (3) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. విలియమ్సన్ క్రీజులో కుదురుకున్నప్పటికీ ధాటిగా ఆడలేకపోయాడు. 40 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ భారీ షాట్లతో ఇంగ్లండ్ ను భయపెట్టాడు. 36 బంతుల్లోనే 62 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే అతనికి సహకరించేవారు లేక మ్యాచ్ చేజారింది. నీషమ్ (6), మిచెల్ (3), శాంట్నర్ (16) తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో 20 పరుగుల తేడాతో కివీస్ ఓడిపోయింది. 


ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.