Sehwag On PAK vs ZIM:  ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే, పాకిస్థాన్‌ ఫలితం దేశాధినేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది! పాక్‌ ఓటమిని జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్‌ బాగా ఆస్వాదించినట్టు ఉన్నారు. పాకిస్థాన్‌కు కౌంటర్‌ ఇస్తూ ట్వీట్‌ చేశారు. దానికి పాక్‌ ప్రధాని షెష్‌బాజ్‌ షరీఫ్‌ వెంటనే స్పందించారు. తమకు వెంటనే పుంజుకొనే అలవాటు ఉందన్నారు. వీరిద్దరి మధ్యలోకీ చతురుడైన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ దూరాడు. జింబాబ్వే అధ్యక్షుడు భలే కౌంటర్‌ వేశారని పొగిడేశాడు.




థ్రిల్లర్‌లా సాగిన సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితం అయింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలపై కూడా ఆధార పడాల్సి ఉంటుంది.


'ఓహ్‌.. జింబాబ్వేకు ఓ అద్భుత విజయం! చెవ్‌రాన్స్‌కు అభినందనలు. వచ్చేసారి నిజమైన మిస్టర్‌ బీన్‌ను పంపించండి' అంటూ జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్‌ ట్వీట్‌ చేశారు. దానికి 'మా వద్ద నిజమైన మిస్టర్‌ బీన్ ఉండకపోవచ్చు. కానీ మాకు అసలైన క్రికెట్‌ స్ఫూర్తి ఉంది. మా పాకిస్థానీలకు పడిన వెంటనే గట్టిగా పుంజుకోవడం అనే సరదా అలవాటుంది. మిస్టర్‌ ప్రెసిడెంట్‌ (ఎమర్సన్‌) కంగ్రాచ్యులేషన్స్‌. ఈ రోజు మీ జట్టు నిజంగానే అద్భుతంగా ఆడింది' అని బదులిచ్చారు. వీరిద్దరి మధ్యలోకీ సెహ్వాగ్‌ దూరాడు. ఎమర్సన్‌ను పొగిడేశాడు. 'హహహ..! అధ్యక్షుల వారూ మస్తు ఆడేశారే' అని ట్వీటాడు.




అసలేంటీ ఫేక్‌ మిస్టర్‌ బీన్‌ కథ?


ఈ మిస్టర్‌ బీన్‌ వ్యవహారం 2016 నాటిది. పాకిస్థాన్‌ కమెడియన్‌ అసిఫ్ మహ్మద్‌ను మిస్టర్‌ పాక్‌ బీన్‌ అంటారు. చూడ్డానికి అతడు అలాగే ఉంటాడు. అసలైన మిస్టర్‌ బీన్‌ను అనుకరిస్తూ హరారేలో ఒక కామెడీ షో చేశాడు. 'మేం అగ్రికల్చర్‌ షోగా భావించే స్థానిక ఈవెంట్లో నిజమైన మిస్టర్‌ బీన్‌ బదులు వారు పాక్‌ బీన్‌ను పంపించారు. మా కుటుంబ సభ్యుల ముందు మేం అవమానపడ్డాం' అని ఒక జింబాబ్వే పౌరుడు ట్వీట్‌ చేయడం గమనార్హం.