AFG vs IRE, T20 World cup 2022:  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో వరుణుడి బ్యాటింగ్‌ మామూలుగా ఉండటం లేదు! దాదాపుగా ప్రతి రోజూ పలకరిస్తూనే ఉన్నాడు. ఇంపార్టెంట్‌ మ్యాచుల్లో జట్లకు షాకిస్తున్నాడు. గెలిస్తేనే బరిలో ఉంటాం అనుకున్న మ్యాచులనూ వర్షంతో ముంచేస్తున్నాడు. శుక్రవారం అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచును ఇలాగే రద్దు చేశాడు.


యెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు లానినా ప్రభావం టీ20 ప్రపంచకప్‌ మజాను పోగొడుతోంది. కనీసం బంతి, టాస్‌ పడకుండానే చాలా మ్యాచులు రద్దవుతున్నాయి. అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. సాధారణంగా బ్యాటర్లు పరుగులు చేస్తుంటే ప్రత్యర్థి జట్లకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ వరుణుడి విధ్వంసకర బ్యాటింగ్‌తో అటు జట్లు, ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఫ్యాన్స్‌, బ్రాడ్‌కాస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం మెల్‌బోర్న్‌ వేదికగా అఫ్గానిస్థాన్, ఐర్లాండ్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఉదయం నుంచి అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. అస్సలు తెరపినివ్వలేదు. జల్లులు తగ్గితే కనీసం 8 ఓవర్ల మ్యాచైనా పెట్టాలని నిర్వాహకులు భావించారు. వరుణుడు అసలు బ్యాటింగ్‌ ఆపకపోవడంతో బంతి పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దాంతో ఐర్లాండ్ గ్రూప్‌ 1లో మూడు మ్యాచులు ఆడి 3 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. శ్రీలంకతో మ్యాచులో ఓటమి పాలైన ఆ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించి 2 పాయింట్లు అందుకుంది. ఇప్పుడు మ్యాచ్‌ రద్దవ్వడంతో మరో పాయింట్‌ వచ్చింది.




సూపర్‌ 12లో ఐర్లాండ్‌ మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా, అడిలైడ్‌లో న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఎవరికైనా షాకిస్తే ఆ జట్టు సెమీస్‌కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయి. నేటి మ్యాచులో ఇంగ్లాండ్‌ చేతిలో ఆసీస్‌ ఓడితే సమీకరణాలు మరింత రసవత్తరంగా మారతాయి. ఇక ఈ ప్రపంచకప్‌లో వర్షం కారణంగా ఎక్కువ నష్టపోయింది అఫ్గానిస్థాన్‌. సూపర్‌ 12 తొలి మ్యాచులో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. వరుసగా న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ మ్యాచులు రద్దయ్యాయి. దాంతో 2 పాయింట్లు, నెగెటివ్‌ రన్‌రేట్‌తో ఆఖర్లో నిలిచింది.


అంతకు ముందు గ్రూప్‌ 2లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్‌కు ఇలాగే జరిగింది. ఓవర్లు కుదించిన ఈ పోరులో జింబాబ్వే నిర్దేశించిన టార్గెట్‌ను సఫారీలు దాదాపుగా ఛేదించారు. మరో 5 నిమిషాల్లో గెలిచేస్తారనగా వర్షం కురిసింది. దాంతో చెరో పాయింటు పంచారు. బుధవారం ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌దీ ఇదే పరిస్థితి. టార్గెట్‌ ఛేదిస్తుండగా వర్షం రావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఇంగ్లాండ్‌ ఓడిపోయినట్టు ప్రకటించారు. భారత్‌, న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌ వర్షార్పణం అవ్వడం తెలిసిందే. పాక్‌తో మ్యాచుకూ వర్షం ముప్పు ఉన్నా ఆ రోజు వరుణుడు మినహాయింపు ఇచ్చాడు.